కేసీఆర్ వాక్చాతుర్యం గురించి, వాక్పటిమ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కేసీఆర్ తనదైన శైలిలో చేసే ప్రసంగాలు తెలంగాణ ప్రజల ని విపరీతంగా ఆకట్టుకుంటాయి. అయితే ఆయన ప్రసంగాల్లో ప్రత్యర్థుల మీద పదునైన వాగ్బాణాల తో విరుచుకు పడడమే కాకుండా ఆసక్తికరమైన సమాచారం కూడా ఉంటుంది. అసలు ఆయన నాయకుడిగా ఎదగడానికి ఈ ప్రసంగాలే ప్రధాన కారణం అని కూడా చాలామంది అంటూ ఉంటారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన వరుసగా బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కెసిఆర్ నిర్మల్ బహిరంగ సభ లో చేసిన ప్రసంగాలు ముస్లింలను ఆద్యంతం ఆకట్టుకున్నాయి. నిర్మల్ లో ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు కట్టే “దట్టి ” వెనకాల ఉన్న ఆసక్తికరమైన కథ చెప్పారు. నిజానికి చాలా మంది ముస్లిం లకు కూడా ఈ దట్టి వెనకాల ఉన్న నేపధ్యం తెలియక పోవడంతో కేసీఆర్ కథ మొదలు పెట్టగానే చాలా ఆసక్తికరంగా వినడం మొదలు పెట్టారు.
కేసీఆర్ చెప్పిన దట్టి కథ:
మక్కా లో, మహమ్మద్ ప్రవక్త మనుమడు ఒకసారి దారిలో వెళుతుండగా, ఒక కసాయి తనకు దొరికిన జింకను చంపబోతూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రవక్త మనమడు, ఆ జింక తన బిడ్డకు పాలు ఇవ్వాలని ఆరాట పడుతుంది అని, ఒకసారి దాన్ని వదిలితే, వెళ్లి తన బిడ్డకు పాలు ఇచ్చేసి మళ్ళీ తిరిగి వస్తుంది అని ఆ కసాయిని వేడుకున్నాడు. అయితే ఒకసారి వెళ్ళాక అది మళ్ళీ ఎందుకని తిరిగి వస్తుంది ? అది రాకపోతే ఎలా? అంటూ ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త మనుమడు, ఒకవేళ అది తిరిగి రాకపోతే తనను చంప మన్నాడు. అందుకు ఆ కసాయి ఒప్పుకోవడంతో, ఆ జింక కాలికి తన చేతిలో ఉన్న రుమాలుతో దట్టి కట్టాడు. అయితే ప్రవక్త మనవడు చెప్పినట్టుగానే, ఆ జింక బిడ్డకు పాలిచ్చి తిరిగి రావడంతో ఆశ్చర్యపోయిన ఆ కసాయి, ఆ జింకను విడిచిపెట్టాడు. ఇది దట్టి వెనుక ఉన్న కథ.
ఎవరైనా బయటికి వెళుతున్నప్పుడు ముస్లిం సోదరులు దట్టి కడితే వారు కచ్చితంగా తిరిగి వస్తారు అని దాని అర్థం. ఈ కథ చెప్పిన కేసీఆర్, తాను ఎప్పుడు ఎక్కడ ప్రచారానికి వెళ్లినా, ముస్లిం సోదరులు తనకు దట్టి కట్టి పంపుతారని, దీనిని ఇమామే జామీనే అని అంటారని చెప్పుకొచ్చాడు. అక్కడితో ఆగకుండా గతంలో చంద్రబాబు నాయుడు రంజాన్ శుభాకాంక్షలు చెప్పమంటే ‘ఈద్ ముబారక్’ అనడానికి బదులు ‘ ఊద్ ముబారక్’ అని అన్నాడని చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి.
నిర్మల్ లో ముస్లింల ఓట్లు కీలకం:
నిర్మల్ లో ముస్లిం ఓట్లు కీలకం కావడంతో కేసీఆర్ ప్రసంగాలు కూడా దానికి తగ్గట్టుగానే రూపొందించినట్లు తెలుస్తోంది. మధ్యమధ్యలో ఉర్దూ లో మాట్లాడిన కేసీఆర్, తన ప్రసంగంలో మోడీ పై కూడా చెణుకులు విసురుతూ, మరోవైపు అసదుద్దీన్ ఒవైసీ ని మెచ్చుకుంటూ, ఆద్యంతం ముస్లింల మనస్సు గెలుచుకునేలా ప్రసంగించాడు. కాంగ్రెస్ నేతలు అసదుద్దీన్ ఒవైసీ కి పాతిక లక్షలు డబ్బిచ్చి, కెసిఆర్ కు మద్దతు పలక వద్దని కోరారని, అలా డబ్బులకు లొంగే వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ కాదని వ్యాఖ్యానించారు. ఈ ప్రసంగాలు ఇటు నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని ముస్లిం లనే కాకుండా తెలంగాణ పరిధిలో ని ముస్లిములు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఇక చివరగా ఎన్నికలనే సరికి అనేక పార్టీల వాళ్ళు వచ్చి అనేక మాటలు చెబుతూ ఉంటారని, ఆ మాటలు విని ఆగం కావద్దని, చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని, తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి మరొకసారి ఆలోచించి, ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
మరి ఈ విజ్ఞప్తికి ప్రజలు ఎలా స్పందిస్తారన్నది మరో రెండు వారాలలో తెలుస్తుంది.