ట్యాపింగ్ కేసుపై కేసీఆర్ తేల్చేశారు. ఆ కేసులో చట్టవిరుద్ధంగా ఏది జరిగినా అదంతా అధికారుల తప్పే కానీ సీఎంకు.. మంత్రులకు సంబంధం లేదనేశారు. తనకు తెలిసి జరిగినదంతా చట్టబద్దంగా జరిగిందని.. మిగిలిన ఏం జరిగినా అది తనకు సంబంధం లేదన్నారు. ట్యాపింగ్ ఇంటెలిజెన్స్ డ్యూటీ.. సీఎంకు, మంత్రులకు సంబంధం ఉండదని కేసీఆర్ అంటున్నారు. అవసరమైతే సీఎంలు కొన్ని రిపోర్టులు అడుగుతారు. ఇవి పూర్తిగా పరిపాలనా సంబంధమైన అంశాలు. అని చెప్పుకొచ్చారు.
ఎవరైనా అధికారి అక్రమంగా చేస్తే, ఆ సంగతి డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అలాంటి దుర్మార్గమైన పనిచేస్తే శిక్ష అనుభవిస్తారు. దానికి పొలిటికల్ ప్రభుత్వానికి సంబంధం ఉండదని కేసీఆర్ తేల్చేశారు. ట్యాపింగ్ పరికరాలు ఏం కొన్నారు.. ఎలా ట్యాపింగ్ చేశారన్నది కూడా సీఎం పట్టించుకోరని చెప్పుకొచ్చారు. రాజకీయ అవసరాల కోసం ట్యాపింగ్ ను వాడుకున్నామో లేదో తనకు తెలియదని కేసీార్ చెప్పుకొచ్చారు. ‘ఫలానా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసినం’ అని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పరన్నారు.
ట్యాపింగ్ ను కేసీఆర్ ఇంటర్ సెప్షన్ అనే అధికార భాషతో తీవ్రత తగ్గించేందుకు ప్రయత్నించారు. రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నారంటూ కేటీఆర్ సహా అనేక మంది ఆరోపణలు చేస్తూంటే… కేసీఆర్ మాత్రం.. తాను అలాంటి ఆరోపణలు చేయనని చెప్పుకొచ్చారు. ట్యాపింగ్ పై కేసీఆర్ స్పందన పూర్తిగా అధికారులపైకి నెట్టేసేలా ఉంది. ఇప్పటికే పోలీసు అధికారులు జైలు పాలయ్యారు.
రాజకీయ అవసరాల కోసం అనధికారిక ట్యాపింగ్ చేశారని ఇప్పటికే స్పష్టమయింది. ఓ కులం అధికారులతో ముఠాగా ఏర్పడి.. మాఫియా తరహాలో తనిఖీల పేరుతో దోపిడీలకూ పాల్పడ్డారన్నఆరోపణలూ వస్తున్నాయి. ఎన్నికల తర్వాత ఈ అంశంపై మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.