తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని… ఒక్క టీఆర్ఎస్ మాత్రమే చేస్తోంది. మహాకూటమిలో సీట్ల సర్దుబాట్లు ఇంకా కొలిక్కి రాలేదు. జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోడీకి వ్యతిరేకంగా.. కూటమిని ఏర్పాటు చేయడం హైలెట్గా మారింది. అక్కడ ఢిల్లీలో ఇలాంటి పరిణామాలు జరుగుతూండగానే.. టీఆర్ఎస్ ఆ కూటమి తెలంగాణకు వ్యతిరేకంగానే అనే ప్రచారాన్ని ప్రారంభించింది. చంద్రబాబు తెలంగాణ విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని… టీఆర్ఎస్ నేతలు అనుమానిస్తున్నారు. కూటమి నేతలు సీట్ల పంపకాలు కూడా వ్యూహాత్మకంగానే ఆలస్యం చేస్తున్నట్టు వారు భావిస్తున్నారు. ఢిల్లీలో రాహుల్, చంద్రబాబు చర్చల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు ఢిల్లీలో హడావడి చేశారు. చంద్రబాబుతో సమావేశం అయ్యేందుకు క్యూ కట్టారు.
తెలంగాణ ప్రయోజనాలకు విరుద్దంగా కాంగ్రెస్ చంద్రబాబుతో కూటమి కట్టిందని టిఆర్ఎస్ నేతలు విమర్శల దాడి పెంచారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అమరావతికి బానిసలుగా మారారని…. రాష్ట్ర అభివృద్దిని రాజకీయాలకు బలి చేయాలని చూస్తున్నారనే ప్రచార వ్యూహాన్ని ఇప్పటికి అమలుచేస్తున్నారు. టి.కాంగ్రెస్ పూర్తిగా చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ గా మారిందని తన అనుచరులను కాంగ్రెస్ లో చేర్పించి చంద్రబాబు బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు ప్రారంభించారు. తెలంగాణలో చక్రం తిప్పాలనే జాతీయ రాజకీయాల పేరిట చంద్రబాబు డ్రామాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో గట్టిగా తీసుకెల్లాలని బావిస్తున్నారు.
చంద్రబాబు, రాహుల్ సమావేశం తర్వాత కాంగ్రెస్ లో కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది సీనియర్ నేతలు ఇద్దరి కలయిక కాంగ్రెస్ కు దేశ వ్యాప్తంగా కలిసి వస్తుందని చెప్తున్నారు. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు కూటమిలోకి రావడం వల్ల మరిన్ని పార్టీలు వస్తాయని అంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పై దేశ వ్యాప్తంగా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. చాలా ఏళ్లుగా రెండు పార్టీల క్యాడర్ మధ్య వైరం ఉండటం వల్ల తెలంగాణాలో పొత్తు కుదరినా టిడిపి ఓటర్లు కాంగ్రెస్ కు ఓటు వేయరేమోననే అనుమానం ఉండేది. కానీ రాహుల్ తో చంద్రబాబు భేటీ తర్వాత రెండు పార్టీల క్యాడర్ మధ్య సఖ్యత పెరుగుతుందని భావిస్తున్నారు.. ఇద్దరు నేతలు కలిసి ప్రచారం చేస్తే ఊపు వస్తుందని చెప్తున్నారు. చంద్రబాబు,రాహుల్ భేటీ ఈ సమయంలో మంచిది కాదేమోననే అభిప్రాయం కూడా కాంగ్రెస్ లో వినిపిస్తోంది. దీనిని కేసీఆర్ అడ్వాంటేజ్ గా తీసుకుంటారేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఆ దిశగానే టీఆర్ఎస్ ప్రచారం కూడా ప్రారంభించింది.