తెలంగాణ సాధన కోసం కేసీఆర్ జేఏసీలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు అధికారం నిలుపుకోవడానికి కూడా అదే వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావల్సిన నిధులతో పాటు పలు అంశాలపై బీజేపీని నిలదీసిందేకు జేఏసీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇంకా విషయం ఏమిటంటే ఇందులో టీఆర్ఎస్ నేతలే ఉండరు. అందరూఉంటారు. కానీ అంతిమంగా టీఆర్ఎస్కు రాజకీయ లాభం ఉంటుంది.
కాజీపేట్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వెంటనే ఏర్పాటే లక్ష్యంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల నేతలతో కలిసి సాధన సమితిని ఏర్పాటు చేశారు. ఆందోళనలు ప్రారంభించారు. అలాగే సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఆదిలాబాద్ యూనిట్ పునరుద్దరణకు సీసీఐ సాధన సమితి’గా ఏర్పడి కేంద్రంపై ఉద్యమించాలని నిర్ణయించారు. మాజీ మంత్రి జోగు రామన్న అందర్నీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బయ్యారం స్టీల్ ప్లాంటు విషయంలోనూ ఇదే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాబోయే రోజుల్లో వివిధ సంఘాలు, సంస్థలతో కలిసి ఆందోళన ముమ్మరం చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కేంద్రం విధానాలపై నిరసనగా త్వరలో జాతీయ సదస్సు నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు , రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యక్ష పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతోంది. టీఆర్ఎస్ నాయకత్వం అంటే చాలా మంది ముందుకు రారు అదే జేఏసీ అంటే వస్తారు. ఇదే ప్లాన్‌తో కేసీఆర్ మరోసారి అందర్నీ కలుపుకునేందుకు ముందడుగు వేస్తున్నారు. వర్కవుట్ అవుతుందో లేదో వేచి చూడాలి. !