తెలంగాణ రాష్ట్ర సమితి నేత కేసీఆర్.. ముందస్తు ఎన్నికలకు రంగం సిద్దం చేసుకున్నారని.. స్పష్టమైన సూచనలు రాజకీయవర్గాలకు అందాయి. ఆయన వెనక్కి తగ్గడానికి అవకాశం కూడా లేదు. ఇప్పుడు వెనక్కి తగ్గితే.. మొత్తం ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ప్రస్తుత పరిస్థితి ప్రకారం.. సభా వేదిక నుంచే.. అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని ప్రకటించి.. ముందస్తుకు వెళ్లబోతున్నట్లు .. ప్రజల ముందు ప్రకటించి.. వారి మద్దతును కోరబోతున్నారు. సహజంగానే.. అందరూ హర్షధ్వానాలతో ఆమోదిస్తారు. కానీ… ఎందుకు ముందస్తుకు వెళ్తున్నారనే విషయంపై మాత్రం కచ్చితంగా క్లారిటీ ఇవ్వక తప్పని పరిస్థితి..! కేసీఆర్ ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారు..? రాజకీయ పరంగా.. ఇప్పటికి దీనిపై అనేక విశ్లేషణలొచ్చాయి.
జమిలి ఎన్నికలు జరిగితే.. బీజేపీ ఎఫెక్ట్ తన పార్టీపై పడుతుందని… ఆ దెబ్బ నుంచి తప్పించుకోవడానికి ముందస్తుకు వెళ్తున్నామనే దగ్గర్నుంచి… కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి అనే వరకూ చాలా కారణాలు బయటకు వచ్చాయి. కానీ ఇవన్నీ రాజకీయ పరమైనవే. వీటినే ప్రజలకు చెబితే ఎవరూ అంగీకరించరు. చెప్పే ప్రయత్నం కూడా చేయరు. అంత వరకూ గ్యారంటీ. కానీ.. .ముందస్తుకు వెళ్లడానికి అందరూ సంతృప్తి పడే కారణాలు చెప్పాల్సి ఉంటుంది. ఆ కరణాలేమిటన్నది ఇప్పుడు.. అందరికీ ఆసక్తికరంగా మారింది. సాధారణంగా.. అభివృద్ది గురించి చెబుతామని కేసీఆర్ చెబుతున్నారు కానీ.. చేసింది చెప్పడం కన్నా.. సభలో మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నమే ఎక్కువ జరుగుతుందని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ మళ్లీ రేపాలంటే.. ఏపీపైనే విమర్శలు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేసుకోవాలి.
ఈ విషయంలో కేసీఆర్ ప్రత్యేక కసరత్తు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణపై చంద్రబాబు అతి పెద్ద కుట్ర చేయబోతున్నారని.. దానికి కాంగ్రెస్ అండగా నిలబడతోందని.. ప్రజలంతా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని.. పిలుపునివ్వబోతున్నారంటున్నారు. తెలంగాణపై జరుగుతున్న ఇలాంటి కుట్రల్నీ కూలగొట్టడానికే.. ముందస్తుకు వెళ్తున్నానని చెప్పబోతున్నారంటున్నారు. నిజానికి కేసీఆర్‌కు ఇంతకు మంచిన ఆప్షన్స్ లేవు. లక్ష కోట్లకుపైగా అప్పులు చేసి చేపట్టిన రెండు ప్రతిష్టాత్మక పథకాలు కాళేశ్వరం, మిషన్ భగీరథ ఇంకా.. బాలారిష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇక చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. ఉన్నదల్లా.. ఏపీ ని.. అక్కడి సీఎంను బూచిగా చూపి.. తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడమే. ఇదే జరగడానికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు.