తనకు బదులు వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్న సీనియర్ నేతలకు బీఆర్ఎస్లో కొదవ లేదు.కానీ కేసీఆర్ మాత్రం ఈ సారి ఎన్నికల్లో కూడా వారసత్వ ముద్ర పడకూడదని కోరుకుంటున్నారు. ఎవరికీ టిక్కెట్లు ఇచ్చేది లేదని నిర్మోహమాటంగా చెబుతున్నారు. స్పీకర్ గా ఉన్న నేత గెలవరనే సెంటిమెంట్ ఉన్నా సరే ఈ సారి కూడా పోచారం శ్రీనివాస్ రెడ్డినే పోటీ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. నిజానికి పోచారం రిటైరైపోదామనుకుంటున్నారు. ఓపిక తగ్గిపోతోందని.. తన పిల్లలకు ఓ దారి చూపించాలని ఆయన కేసీఆర్ ను కోరుతున్నారు. ఆయన కుమారుడు కూడా ప్రజల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ సారి పోచారమే పోటీ చేయాలని తేల్చారు. దీంతో పోచారానీకి తప్పడం లేదు.
ఒక్క పోచారం మాత్రమే కాదు.. తమకు ఇవ్వకపోయినా పర్వాలేదు.. తమ పిల్లలకు ఇవ్వాలని కొందరు.. తమతో పాటు తమ పిల్లలకూ చాన్సివ్వాలని ఒత్తిడి చేసవారు మరికొందరు ఉన్నారు. అయితే ఎవరికీ కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పోటీకి రెడీ అయ్యారు. కానీ ఆయన ఏ నియోజకవర్గంలో వేలు పెట్టినా సమస్య అవుతోంది. సబితా ఇంద్రారెడ్డిని పక్కన పెట్టి కార్తీక్ కు టిక్కెట్ ఇవ్వడానికి కేసీఆర్ సిద్ధంగా లేరు. గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కుమారుడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కడియం శ్రీహరి కుమార్తెకు టిక్కెట్ అడుగుతున్నారు.
టీడీపీ ఆావిర్భావంతో తెలంగాణ నుంచి అనేక మంది నేతలు పైకి ఎదిగారు. వారిలో చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నారు. వారిలో ఓపిక ఉన్న వారు సరే.. ఓపిక లేని వాళ్లు వారసుల కోసం అడుగుతున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఒకరిద్దరికి చాన్స్ ఇచ్చినా ప్రజల్లో వారసత్వ భావన వస్తుందని.. అది డ్యామేజ్ చేస్తుందని అనుకుంటున్నారు. అందుకే ఈ సారికి కూడా సీనియర్లే పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. వారూ అంగీకిరంచక తప్పడం లేదు.