హైదరాబాద్‌లో సంచలనం నమోదైంది. ఎలాంటి వ్యవహారాలు జరిగినా… సూపర్ పవర్ ఫుల్ చీఫ్ మినిస్టర్‌గా ఉన్న సీఎం కేసీఆర్ బంధువుల జోలికి పోలీసులే వెళ్లారు. సమీప బంధువుల జోలికి అయితే అసలు వెళ్లరు. అలాంటిది… ముగ్గుర్ని దుండగులు కిడ్నాప్ చేశారు. ఐటీ అధికారుల పేరుతో ఇంట్లోకి చొరబడి ప్రవీణ్ రావు సహా ముగ్గురు సోదరుల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. ఈ విషయం బయటకు తెలిసిన తర్వాత ఇక హడావుడికి హద్దేముంటుంది. పెద్ద ఎత్తున దుమారం రేగింది. పోలీసులు ఉరుకులు పరుగులు మీద రంగంలోకి దిగారు. చివరికి కిడ్నాప్ జరిగిందని తేల్చారు. తర్వాత రెండు గంటల్లో అందర్నీ పోలీసులు విడిపించినట్లుగా కూడా సమాచారం వచ్చింది. కానీ అసలు విషయాలేమిటో చెప్పలేదు. చెప్పిన తర్వాతే అసలేం జరిగిందో బయట పడుతుంది.
సీఎం కేసీఆర్ సోదరీమణి కుమారులు ప్రవీణ్ రావు… అతని సోదరులుగా భావిస్తున్నారు. వారింటికి తరచూ కల్వకుంట్ల కవిత కూడా వస్తూంటారు. శుభకార్యాలు జరిగినప్పుడు.. కేసీఆర్ కుటుంబం నుంచి ఎక్కువ మంది వస్తూంటారు. ఇటీవల గృహప్రవేశ కార్యక్రమానికి కవిత కుటుంబ సమేతంగా వచ్చినట్లుగా చెబుతున్నారు. వీరు రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్నారు. ఈ వ్యవహారాల వల్లే.. ప్రత్యర్థులు కిడ్నాప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే.. ఈ కిడ్నాప్ వ్యవహరం.. తెలంగాణ శాంతిభద్రతల అంశాన్ని ప్రశ్నార్థకం చేస్తుంది కాబట్టి… పోలీసులు జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు. పూర్తి వివరాలు బయట పెట్టడం లేదు.
హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న ఓ ఖరీదైన స్థలం విషయంలో వివాదం ఉందని చెబుతున్నారు. ఆ వివాదంలో ప్రవీణ్ రావుతో పాటు… రాయలసీమకు చెందిన ఓ రాజకీయ నేత అనుచరులు జోక్యం చేసుకున్నారని.. అక్కడే సమస్య వచ్చిందని చెబుతున్నారు. ఈ క్రమంలో… జరిగిన లావాదేవీల్లో… రాయలసీమ నేత అనుచరులు.. ప్రవీణ్ రావ అతని సోదరుల్ని కిడ్నాప్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. అయితే అతను.. సీఎం కేసీఆర్ బంధువని తెలియకుండా ఉండదు.. తెలిసిన తర్వాత కూడా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అంటే సామాన్యమైన విషయం కాదు. వారిని భయపెట్టి… తాము చేయదల్చుకుంటే ఏమైనా చేయగలమని చెప్పడానికే.. ఈ పని చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
నిజానికి ఇటీవలి కాలంలో ఇలాంటి వ్యవహారాలేమీ హైదరాబాద్‌లో జరగడం లేదు. రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు తగ్గిన తర్వాత.. ముఠాల జోక్యం కూడా తగ్గిపోయింది. అయితే అవి అంతర్గతంగా జరుగుతున్నాయని తాజా పరిణామాలతో తేలిపోయింది. సీఎం కేసీఆర్ బంధువుల్నే కిడ్నాప్ చేయించిన ఆ రాజకీయ నేత ఎవరో తేలిపోయే అవకాశం ఉంది.