హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి పదిరోజుల చైనా పర్యటన ముగించుకుని ఛార్టర్డ్ ఫ్లైట్లో బుధవారం హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయంనుంచి నేరుగా సమీపంలోనే ఉన్న చినజియర్ స్వామి ఆశ్రమానికి కేసీఆర్ వెళ్ళారు. అక్కడ జరుగుతున్న ‘మై హోమ్’ రామేశ్వరరావు షష్టిపూర్తి వేడుకలలో సీఎమ్ పాల్గొన్నారు. రాత్రి పొద్దు పోయినదాకా అక్కడే ఉన్న కేసీఆర్, తర్వాత సిటీలోని ఇంటికి వెళ్ళారు. గురువారం ఉదయం ఎర్రవల్లి గ్రామంలో ఉన్న ఫార్మ్హౌస్కు చేరుకున్నారు. నిన్న ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదతరులు అక్కడకే వెళ్ళి సీఎమ్తో భేటీ అయ్యారు.
ముఖ్యమంత్రి రోజుల తరబడి ఫార్మ్హౌస్లోనే ఉంటున్నారని, పరిపాలనను పట్టించుకోవటంలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా కేసీఆర్ పట్టించుకోకుండా తన దారిలో తాను వెళుతున్నట్లు కనబడుతోంది. సచివాలయానికైతే అమావాస్యకో, పౌర్ణమికో ఒకసారి వెళుతున్నారు. పదిరోజుల తర్వాత రాష్ట్రానికి తిరిగొచ్చిన ముఖ్యమంత్రి, ఈ పదిరోజుల పాలనా వ్యవహారాలను, రైతుల ఆత్మహత్యలను, రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను, ముఖ్య సంఘటనలను ఒకసారి సమీక్షిస్తే బాగుండేది. కనీసం చైనాపర్యటన వివరాలను, ఆ పర్యటనద్వారా ఏర్పడిన ప్రయోజనాలను మీడియాకు తెలియజేయాల్సింది. అలాంటిదేమీ లేకుండా ఫార్మ్హౌస్కు వెళ్ళి సేదతీరటం విమర్శలకు తావిచ్చేలా ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి చైనా పర్యటనకైన ఖర్చు లెక్కలు చెప్పాలని మధుయాష్కీ గౌడ్, షబ్బీర్ అలీ వంటి కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.