భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఎప్పుడూ రేవంత్ రెడ్డి అనే మాటను తన నోటి వెంట రానిచ్చేవారు కాదు. తాను స్పందిస్తే.. రేవంత్ మరింతపెద్ద లీడర్ అవుతాడని ..బాల్క సుమన్ లాంటి నేతలతో కౌంటర్ ఇప్పించేవారు. ఎన్నికలకు ముందు వరకూ అంతే. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అవుతారా లేదా అన్నదానిపైనా మాట్లాడుతున్నారు. కొడంగల్ లో బహిరంగసభ పెట్టిన కేసీఆర్ రేవంత్ రెడ్డి సీఎం అవుతారన్న ప్రచారాన్ని నమ్మవద్దని అక్కడి ప్రజల్ని కోరారు. ఫేక్ ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ కు ఇరవై సీట్ల కంటే ఎక్కువ రావన్నారు.
ఈ మాటలతో పాటు రేవంత్ ను ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ లాంటి విమర్శలు చాలా చే్శారు కానీ.. రేవంత్ సీఎం రేసులో ఉన్నట్లుగా ఒప్పుకున్న ఆయన తీరు కాంగ్రెస్ పార్టీకి.. రేవంత్ ఫ్యాన్స్ కు బూస్ట్ ఇచ్చినట్లయింది. ఇలా కొడంగల్ లో వ్యాఖ్యలు చేశారని తెలియగానే.. వెంటనే రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. వ్యూహాత్మకంగా తాను సీఎం అవుతానని చెప్పలేదు కానీ.. కాంగ్రెస్ పార్టీకి ఎనభైసీట్ల వస్తాయని.. డిసెంబర్ మూడో తేదీన లెక్క పెట్టుకోవాలని కేసీఆర్కు సవాల్ చేశారు. కాంగ్రెస్ కు ఎనభై సీట్లు తగ్గిస్తే నువ్ వేసే శిక్షకు తాను సిద్ధంగా ఉంటానని కేసీఆర్ కు ప్రతి సవాల్ చేశారు. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డిని విమర్శించక తప్పని పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ లో ఆయన ప్రాధాన్యత సీఎం అభ్యర్థిగా ఫ్రంట్ రన్నరగా ఉండాలని గుర్తించాల్సిందేనని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. విమర్శలు ప్రారంభించారు. రేవంత్ రెడ్డి అప్పటికే వినాల్సిన విమర్శలు.. పడాల్సిన నిందలు.. వెళ్లాల్సిన జైళ్లు అన్నీపూర్తయిపోయాయి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి దేనికైనా తెగించి ఉన్నారు. తాను ఇక తెలంగాణ ప్రజలకు అంకితమని.. ఆయన ప్రజలకు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందన్నట్లుగా.. కాంగ్రెస్ కు ఓటు వేయవేద్దని చెప్పడానికే సభలు పెడుతున్న కేసీఆర్.. చివరికి కొడంగల్ ప్రజలకు రేవంత్ సీఎం అవరని చెప్పారు. కానీ కేసీఆర్ మాటలు అక్కడి ప్రజలకు వేరేలా అర్థమయ్యే అవకాశం ఉంది.