హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మెదక్ జిల్లా దుబ్బాకలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దుబ్బాకలో గతంలో తాను సెకండరీ విద్యను అభ్యసించిన పాఠశాలకు నూతన భవనానికి శంకుస్థాపన చేశారు. దుబ్బాకకు అనేక వరాలు గుప్పించారు. రామసముద్రం చెరువు సుందరీకరణ, 33/11 కేవీ సబ్ స్టేషన్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, 100 పడకల ఆసుపత్రి మంజూరు చేశారు. రు.5 కోట్లతో టౌన్ హాల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వెంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రు.3 కోట్ల విరాళం ఇస్తానని చెప్పారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు జరిగిన జన్మభూమి కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ కార్యక్రమంలో మెదక్ జిల్లా ముందంజలో ఉండేదని చెప్పారు. అధికారులతో ప్రేమతో మెలిగి తాము పనులు చేయించుకునే వాళ్ళమని అన్నారు. తన గత స్మృతులను నెమరువేసుకున్నారు. తన తండ్రి తనను ఇంజనీర్ లేదా డాక్టర్‌ను చేయాలని కలలు కన్నారని చెప్పారు. తనకు తెలుగు సాహిత్యమంటే అభిమానమని అన్నారు. ఆత్మీయులు ఇచ్చిన విందుకు హాజరైన కేసీఆర్, త్వరలో తాను కూడా ఆత్మీయులకు విందు ఇస్తానని చెప్పారు. తన పాత మిత్రులను కలిసి పేరుపేరునా పలకరించారు. మెదక్ జిల్లాను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. తెలంగాణకు విద్యుత్ బాధ పోయిందన్నారు.