తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఎన్నికల ఫలితాలు వెలువడగానే నేరుగా వెళ్లి గవర్నర్ తమిళిసైకి ఇచ్చారు. ముఖ్యమంత్రిగా తన కాన్వాయ్ ను కూడా ప్రగతి భవన్ లోనే వదిలేశారు. కాన్వాయ్ లేకుండానే రాజ్ భవన్ కు వెళ్లి రాజీనామా పత్రం ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోయినందున రాజీనామా చేశారు. ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మంగా ఉండాలని సంప్రదాయంగా గవర్నర్ సూచించారు. తెలంగాణ ఏర్పడిన తరవాత రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఘన విజయాలు సాధించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే తెలంగాణ అని.. ప్రజలు తమ పార్టీని కాదనుకోరని గట్టి నమ్మకం పెట్టుకున్నారు.
కానీ ఎన్నికలు ఫలితాలు తిరగబడ్డాయి. మూడో సారి కేసీఆర్ కు అధికారాన్ని ఇచ్చేందుకు అంగీకరించలేదు. పార్టీని ఓడగొట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న తన పార్టీ పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకుని కేసీఆర్ పేరు బంధాన్ని తెలంగాణతో వదిలించుకున్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్తో ఉన్న పదవి బంధాన్ని తెంచేసుకున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి గా లేని తెలంగాణ ఉంటుందని చాలా మంది బీఆర్ఎస్ క్యాడర్ ఊహించలేకపోయారు.
తర్వాత కేసీఆర్ రాజకీయ అడుగులు ఎలా ఉంటాయన్నదానిపై ఆసక్తి ఏర్పడుతోంది. ఆయన గజ్వేల్ నుంచి గెలిచినప్పటికీ.. అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ఎల్పీ నేతగా కేటీఆర్ కు బాధ్యతలిచ్చి తాను తాను జాతీయ రాజకయాలు చేయడమో లేదా… వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం కసరత్తు చేయడమో చేస్తారని భావిస్తున్నారు.