తెలంగాణ గడ్డ మీద మీటింట్ పెట్టిన సోనియా గాంధీ, ఆంధ్రాకి ప్రత్యేక హోదా ప్రకటించడం ఏంటంటూ ప్రశ్నించారు తెరాస అధినేత కేసీఆర్. ఇబ్రహీపట్నంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రస్థావన తీసుకొచ్చారు. ఏపీకి హోదా అంటే మన దగ్గరున్న పరిశ్రమలన్నీ పోవాల్నా అన్నారు కేసీఆర్. ఈ అంశమ్మీద తెలంగాణ ప్రజలకు వివరణ రాహుల్ గాంధీ కచ్చితంగా ఇచ్చి తీరాలని డిమాండ్ చేశారు. ‘ఆంధ్రాకి కావాలంటే ప్యాకేజీ ఇచ్చుకో.. మాకు సంబంధం లేదు. కానీ, ఆ హోదాలో భాగంగా ఇచ్చే పరిశ్రమల రాయితీలను తెలంగాణకు కూడా ఇయ్యాలి. గత బిల్లులో ఇస్తామని మీరు చెప్పిన్రు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పిండు. ఆ మాట మీదే ఉండాలె. లేకపోతే తెలంగాణ మిమ్మల్ని దంచుతాద’ని చెప్పారు.
ఇక, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద యథావిధిగా విమర్శలు కేసీఆర్ చేశారు. తెలంగాణకు చంద్రబాబు అవసరమా.. అవసరమా అంటూ ప్రజలతో సమాధానం చెప్పించారు. అసెంబ్లీ రద్దు చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే అనీ, అభివృద్ధి కార్యక్రమాల్లో అడ్డుతగులుతున్నారు కాబట్టి, ప్రజాక్షేత్రంలోనే మరోసారి నిరూపించుకోవాలనుకునే నిర్ణయం తీసుకున్నా అని వివరించారు.
అసలు విషయానికొస్తే… ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తే, పరిశ్రమలకు తత్సమాన రాయితీలు తెలంగాణకీ ఇవ్వాలని బిల్లులో ఉందని కేసీఆర్ చెబుతున్నారు. సరే, హోదా కోసం ఆంధ్రా సర్కారు చేస్తున్న పోరాటం, కేంద్రం అనుసరించిన వైఖరీ ఏంటనేది గత నాలుగేళ్లుగా ప్రజలంతా చూస్తున్నారు, అది వేరే అంశం. మరి, హోదాతో సమానమైన ప్రయోజనాలు తెలంగాణకీ ఇవ్వాలని బిల్లులో ఉన్నప్పుడు… ఆ దిశగా కేసీఆర్ ఇంతవరకూ చేసిన ప్రయత్నం ఏదైనా ఉందా..? ఆంధ్రాతో మాకేంటి సంబంధం… మాకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వండీ అంటూ ఏనాడైనా కేంద్రాన్ని డిమాండ్ చేశారా..? విభజన చట్టంలోని అంశాల కోసం మోడీ సర్కారుపై తెరాస ఏనాడైనా ఒత్తిడి తెచ్చిందా..? ఎప్పుడైతే ఆంధ్రాకు హోదా అనే అంశం తెరమీదికి వస్తుందే… అప్పుడే తమకూ వాటా ఉందంటూ కేసీఆర్ మాట్లాడతారు. ముందస్తు ఎన్నికలను సుసాధ్యం చేసుకోవడం కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినవారు… విభజన బిల్లులోని అంశాలను సాధించుకునేందుకు ఆ స్థాయి ప్రయత్నం ఏం చేశారో తెలంగాణ ప్రజలకు చెబితే… ఇప్పుడు కేసీఆర్ వినిపిస్తున్న వాదనకు మరింత బలం చేకూరినట్టవుతుంది. ఇంకోటి.. ఏపీకి హోదా వస్తే.. తెలంగాణలో ఉన్న పరిశ్రమలు పోతాయా..? ఎలా పోతాయి..? ఇలాంటి ప్రకటన ద్వారా ప్రజల్లో ఒక రకమైన భయాన్ని కలిగించడం తప్ప… వాస్తవం ఉందా..?