ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉండాల్సిన సంబంధ బాంధవ్యం, చుట్టరికం ఏంటనేది తరువాత మాట్లాడుకుందాం! ముందుగా, తెలంగాణలో జరుగుతున్న బతుకమ్మ కానుక చీరల లొల్లి గురించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఎలా స్పందించారో చూద్దాం. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ఆడపడుచులకు సర్కారు చీరలు కానుకగా ఇవ్వాలని అనుకుంది. ఆ కానుకలు నాసిరకంగా ఉన్నాయంటూ లొల్లి షురూ అయింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతిపక్షాలు కేసీఆర్ సర్కారును చీల్చి చింతకి కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. చీరల పంపిణీ తీరుపై సమీక్షించారు. ప్రతిపక్షాలు చేస్తున్న చిల్లర రాజకీయాల గురించి ఎవ్వరూ పట్టించుకోవద్దని సొంత పార్టీకి దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఆడపడుచులపై ‘సోదర ప్రేమ’తో చీరలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందనీ, దీన్ని కూడా రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు చూస్తే.. చివరికి వారే దెబ్బతినాల్సి వస్తుందన్నారు. వారు ఎన్ని చీరలు తగులబెడితే, అంతగా నష్టపోతారని కూడా జోస్యం చెప్పారు.
ఏతావాతా కేసీఆర్ సాబ్ ఇచ్చిన స్పష్టత ఏంటంటే.. చీరల గొడవను లైట్ తీసుకోవాలని! దాని వల్ల అధికార పార్టీపై పడే మరకలేం ఉండవనీ, నిర్ణీత గడువులో ఆడపడుచులకు చీరలు అందించేలా చర్యలు చేపట్టాలనీ, మహిళలు క్యూల్లో గంటల తరబడి నిలబడకుండా చూడాలని సీఎం చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బతుకమ్మ కానుకలు ఇస్తున్నాం కాబట్టి, ప్రజలో దీన్ని అర్థం చేసుకుంటారనేది కేసీఆర్ ధీమా. ఇది సెంటిమెంట్ ను టచ్ చేసే కార్యక్రమం కాబట్టి, ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదనేది ఆయన విశ్లేషణ. ఇలాంటివి ఎలా నిర్వహించాలో కేసీఆర్ కు తెలీదా చెప్పండీ..!
సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం! ‘సోదర ప్రేమతో ఆడబిడ్డలకు కానుకలు ఇస్తున్నాం’ అని కేసీఆర్ చెబుతున్నారు. ప్రజలపై పాలకుల ఈ సోదర ప్రేమ, పెద్దన్న పాత్ర ఉండాల్సిన అవసరం ఏముందండీ..? ప్రజలకీ ప్రభుత్వానికి మధ్య బాధ్యతలు తప్ప.. ఇలాంటి భావోద్వేగాలతో కూడిన చుట్టరికాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పడమేంటండీ..? అసలు, ప్రజలను ప్రేమగా చూడాలని ఎవరు చెప్పారు..? పరిపాలనలో ఈ ‘ప్రేమ’ అనే కాన్సెప్ట్ ఏంటీ..? సాధారణ పరిపాలనలోకి ఈ భ్రాతృత్వాలు, ధాతృత్వాలు అనే భావనలు ఎందుకొస్తున్నాయి..? ప్రజల సంక్షేమం చూడటం అనేది అధికార పార్టీ కర్తవ్యం. అది ప్రజలు ఇచ్చిన బాధ్యత. అదొక విధి నిర్వహణ మాత్రమే.
అంతేగానీ, అదేదో వారి సేవా గుణమో, పెద్ద మనసో, ప్రేమ స్వభావమో కాదు కదా! వాస్తవంగా ఆలోచిస్తే, ఈ చీరల పంపిణీ వల్ల ప్రజలకు కొత్తగా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు! ఈ కానుకల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు అట్నుంచీ ఇటు మారిపోవు. సమీప భవిష్యత్తులో కూడా దీని వల్ల అద్భుతాలుఏమీ జరగవు. ప్రజల్లో ఉన్న ఒక సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా మార్చుకునే ఓటు బ్యాంకు రాజకీయం మాత్రమే ఇది. ఇలాంటి కార్యక్రమాన్ని సాక్షాత్తూ ముఖ్యమంత్రే అద్భుతం అన్నట్టుగా ప్రమోట్ చేయడం, అదేదో తన సోదర ప్రేమ అన్నట్టుగా చిత్రీకరించుకోవడం, విమర్శిస్తున్నవారికి శాపనార్థాలు పెట్టడం… ఏంటో, ఈ ధోరణిని ఏమని అర్థం చేసుకోవాలో! పాలకులూ ప్రజలకు మధ్య బాధ్యతలే ఉంటాయి. ప్రభుత్వానికి ప్రజల పట్ల కర్తవ్యం మాత్రమే ఉంటుంది. ప్రేమలూ అభిమానాలూ ఇలాంటివి ఎందుకు చొప్పిస్తున్నారు..? ప్రజలకు కానుకలిచ్చి సంతృప్తి పరచడం అనేది ఏ తరహా పాలన అవుతుంది!