మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంపై విమర్శలకు ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రభాషలో సమాధానమిచ్చారు. రాజకీయంగా ఆయన ఆగ్రహాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని ఆ సమాధానం సందర్భంలో చెప్పిన మాటల సారాంశం విమర్శలకు పరోక్ష ఆమోదం లాగానే వుంది. ఈ ఒప్పందమే చారిత్రాత్మకమని హడావుడి చేసి స్వాగత సత్కారాలు జరిపించుకున్నారు. ఇది ఇతర రాష్ట్రాల మధ్య సంబంధాలకు మార్గదర్శకమన్నారు.అయితే నిర్దిష్టంగా ఒప్పందమేమీ కుదరలేదని కేవలం అంతర్ రాష్ట్ర చర్చల వ్యవస్థ మాత్రమే ఏర్పడిందని నేను గతంలోనే రాశాను. దీనికే కాంగ్రెస్ నాయకులు తమవైన రాజకీయాలు కూడా జోడించి మరింత దూరం వెళ్లారు. సిపిఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం కూడా సవివరంగా సోదాహరణంగా విమర్శ చేశారు.
1. ఇది గతంలో కుదుర్చుకున్న ఒప్పందాల వంటిదే గాని కొత్తది కాదు. మరీ ముఖ్యంగా 2012లో కిరణ్ కుమార్ రెడ్డి సంతకాలు చేసినదానికి దగ్గరగా వుంది.
2. తుమ్మడిహట్టి బ్యారేజీ ఎత్తు తగ్గించడానికి ఒప్పుకోవడం సరైంది కాదు.
3. ఈ రీడిజైనింగుల వల్ల వ్యయం పెరగడమే గాక ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు దండగై పోతుంది. అన్నవి ఈ విమర్శలలో ముఖ్యాంశాలు. కెసిఆర్ సమాధానంలో –
1.గతంలోనే ఒప్పందాలు కుదిరితే ఎందుకు అమలు చేయలేదు అన్నారు గాని జరగలేదని కొట్టిపారేయలేదు.
2. బ్యారేజీ ఎత్తు తగ్గించేందుకు ఒప్పుకున్నామని ఎవరు చెప్పారు? మీడియా వారి సమాచారం ప్రకారం రాయొచ్చు అన్నారే గాని వారినీ తప్పు పట్టలేదు. తము తగ్గించేందుకు సిద్ధంగా లేమని స్పష్టంగా చెప్పలేదు.
3.గతంలో చేసిన ఖర్చు వృధాపై అనవసరంగా వ్యయం చేశారు గనక దానికి బాధ్యత వారిదే అన్నారు గాని వృథా కాబోదని చెప్పలేదు. గతంలో బాబ్లీ సమస్య వచ్చినప్పుడు ఇది పెద్ద వివాదమే కాదన్న వారు ఇప్పుడు ఎగువన కట్టిన బ్యారేజీల వల్ల గోదావరి నీరు దాదాపుగా బంధితమై పోయిందని ఆగ్రహావేదనలు వెలిబుచ్చారు. ఈ వాదనలన్నీ చూస్తే కెసిఆర్ రాజకీయంగా ఎదురుదాడి చేస్తూనే విమర్శలలోని విషయాన్ని దాదాపు ధృవీకరించారని చెప్పాలి. సూత్రప్రాయంగా కుదిరిన ఒప్పందం మాత్రమే అయితే ఎందుకంత హడావుడి చేశారనేది మొదటి విషయం. ఎత్తు తగ్గింపుపై కథనాలు రావడమే గాక పట్టువిడుపులకు నిదర్శనంగా ప్రచారం పొందుతుంటే ఎందుకు విడగొట్టుకోలేదు? చివరగా నిధుల కొరత నేపథ్యంలో ఇప్పటికే వెచ్చించిన 8వేల కోట్లు సద్వినియోగం చేసుకోవడం గురించి ఎందుకు ఆలోచించడం లేదు? కాంగ్రెస్ను లేదా తెలుగుదేశంను ఎంతగా విమర్శించినా ఇబ్బంది లేదు. కాని తన ప్రభుత్వం ప్రచారాలలో అతిశయోక్తులను అవాస్తవాలను సరిచూసుకోవలసిన బాధ్యత ముఖ్యమంత్రికే వుంటుంది కదా.