తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ పై పోరాటానికి కొత్త టార్గెట్ ను ఎంచుకున్నారు. అదే..కొత్త సచివాలయ నిర్మాణం నిర్ణయంపై పోరుబాట పట్టడం. తెలంగాణ ప్రభుత్వం నెలాఖరులో…కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేయబోతోంది. దీని కోసం… పద్దెనిమిదో తేదీన కేబినెట్ నిర్ణయం తీసుకోబోతున్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలను కూలగొట్టి.. ఆ స్థానంలో కొత్త భవనాన్ని నిర్మించబోతున్నారు. ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి.. పట్టుకున్నారు. ఆయన ఈ రోజు నుంచే…తెలంగాణ సర్కార్ పై పోరాటం ప్రారంభించారు. రోజంతా సెక్రటేరియట్లో ఉండి.. సీఎస్‌ను కలిసేందుకు ప్రయత్నించారు.
సీఎస్ లేకపోవడంతో కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు. సెక్రటేరియట్ భవనాలను కూలగొట్టవద్దని… ఆ లేఖలో రేవంత్ కోరారు.
సచివాలయ భవనాలను కూల్చి వాస్తు పండితులు చెప్పినట్లు… కొత్త భవనాలు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారుని.. అయితే ప్రస్తుత సచివాలయంలో కొన్ని భవనాలు నిర్మించి 15 ఏళ్ళు కూడా కాలేదని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. వందల కోట్ల విలువైన భవనాలను కూల్చి … ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేందుకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుమారుడు ముఖ్యమంత్రి కాలేరని వాస్తుపండితులు చెప్పారని అందుకే కేసీఆర్ భవనాలను కూల్చేందుకు సిద్దమయ్యారని విమర్శలు గుప్పించారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తును నమ్మవచ్చు కానీ పిచ్చిగా వ్యవహరించడం తగదని హితవు పలికారు.ప్రభుత్వం ముందుకెళితే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
ఇంటర్ బోర్డ్ అవకతవకల తర్వాత.. రేవంత్ రెడ్డి.. తెలంగాణ సర్కార్ పై పోరాటానికి..సచివాలయం అంశాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సచివాలయాన్ని నిర్మించడానికి ప్రయత్నిస్తూండటంతో..దాన్నే లక్ష్యంగా చేసుకోవాలని..రేవంత్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి…కోర్టులకు వెళ్లిసైతం పోరాడతానంటున్నారు కాబట్టి.. కేసీఆర్‌కు… కొత్త సచివాలయం విషయంలో కొన్ని చిక్కులు తప్పని పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.