రైతులకు సరిపడా యూరియా లభ్యం కావడం లేదు మహప్రభో అని ఎంత మొత్తుకుంటున్నా… ఇదంతా ప్రతిపక్షాల కుట్ర, విమర్శలు మాత్రమే అని చెబుతూ వచ్చారు. కొరతే లేదనీ, ఎక్కడో ఒకటో ట్రెండు చోట్ల కొరత ఏర్పడితే… దాన్ని రాష్ట్రమంతా ఉందని ప్రతిపక్షాలే పెద్దవి చేసి చెబుతున్నాయన్నారు. చివరికి, యూరియా కోసం ఒక రైతు క్యూలైన్లో మరణిస్తే… దాని మీద కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు వ్యవసాయమంత్రి. నిన్నటి వరకూ కొరతే లేదని చెప్పినవారు, ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమీక్షకు వచ్చేసరికి… కొరత తీవ్రంగానే ఉంది సార్ అనేశారు.
రాష్ట్రంలో ఏర్పడ్డ యూరియా కొరతపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా యూరియా సరఫరా చేయాలంటూ అధికారులను ఆదేశించారు. పోర్టుల్లో ఉన్న యూరియా స్టాకును వెంటనే రైళ్లు, రోడ్డు మార్గాల ద్వారా గ్రామాలకు తరలించారనీ, రాత్రీపగలూ తేడా లేకుండా ఈ పని జరగాలన్నారు. యూరియా కోసం రైతులు ఎదురుచూసే పరిస్థితులు ఉండొద్దనీ, లక్షన్నర టన్నుల స్టాకు రాబోయే మూడు లేదా నాలుగు రోజుల్లో రాష్ట్రానికి చేరాలని ఆదేశించారు. నేరుగా గ్రామాలకు యూరియా స్టాక్ వెళ్లాలన్నారు. ఇంతకీ యూరియా కొరతకు కారణం ఏం చెప్పారో తెలుసా…. డిమాండ్ అధికంగా ఉంది కాబట్టి అని అధికారులు తేల్చి చెప్పారు!
రాష్ట్రంలో ఏయే పంటలు సాగు అవుతున్నాయో, వాటి అవసరాలేంటో ముందుగా అంచనా ఉండాల్సింది వ్యవసాయ శాఖకి. ఇది ప్రతీయేటా రొటీన్ గా జరిగే కార్యక్రమమే. అయితే, ఈ యూరియా కొరతకి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. దాన్ని కనిపించకుండా ఉండేందుకు.. డిమాండ్ పెరిగిందనీ, పంటలు పండించే భూముల సంఖ్య పెరగబట్టే అనూహ్యమైన కొరత ఏర్పడిందనే ఒక పాజిటివ్ యాంగిల్ చూపుతూ విశ్లేషించే ప్రయత్రం ప్రభుత్వం చేస్తోంది. పంటలు పడించే భూములు పెరిగితే, అవి కూడా పరిగణనలోకి తీసుకుని అంచనాలు మార్చుకోవాలి కదా! గడచిన పదిరోజులుగా రైతులు రోడ్లెక్కుతున్నా… అబ్బే, అదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. ఇదే విశ్లేషణ, ఇవే ఆదేశాలు ఓ వారం ముందుంటే దుబ్బాకలో రైతు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది కాదేమో! సమస్య తీవ్ర రూపం దాల్చితే తప్ప ప్రభుత్వం స్పందించని పరిస్థితి కనిపిస్తోంది.