డ్రగ్స్ సరఫరా, పంపిణీతోపాటు వాడకం కూడా నేరమే! ఈ విషయంలో ఎవ్వరిన్నీ ఉపేక్షించేందు లేదు, అధికార పార్టీ నేతలున్నా వెనక్కి తగ్గేది లేదు, ఎంతటివారైనా చర్యలు తప్పవు, అధికార పార్టీవారున్నా కేసులు పెట్టేందుకు ఉపేక్షించొద్దు… కొద్ది రోజులు కిందట ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల సారాంశం ఇది. అయితే, తాజా డ్రగ్స్ కేసు మీద మరోసారి సమీక్షించారు ముఖ్యమంత్రి. డ్రగ్స్ వాడుతున్నవారిని కేవలం బాధితులుగానే పరిగణిస్తామని కేసీఆర్ అన్నారు. డ్రగ్స్ వ్యాపారం, పంపిణీ, అమ్మకం వంటివి నేరంగా ప్రకటించారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ పన్నెండు మందిని కేవలం వాడకం దారులుగానే గుర్తించామనీ, నేరస్థులుగా పరిగణించలేమని సీఎం చెప్పారు. సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక డ్రగ్స్ వాడకం, సరఫరా జాబితాలో తెలంగాణ లేదన్నారు. కేసుకు సంబంధించి సూత్రదారులను పట్టుకునే పనిలో ఉన్నామన్నారు. నేరస్థుల్ని శిక్షిస్తామనీ, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు.
ఈ కేసు విషయంలో సినీ రంగాన్ని టార్గెట్ చేసుకుని వేధిస్తున్నారంటూ వినిపిస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. అయితే, డ్రగ్స్ అమ్మకం, వ్యాపారం వంటి విషయాల్లో సినీ రంగం వారి పాత్ర ఉందని నిరూపణ అయితే వారిపై కూడా కేసులు పెడతామని స్పష్టం చేశారు. ఇక, ఐటీ పరిశ్రమలో డ్రగ్స్ వాడకం దారులు ఎక్కువగా ఉన్నారంటూ జరుగుతున్న ప్రచారాన్నికూడా కేసీఆర్ కొట్టి పారేశారు. ఐటీ రంగంలో డ్రగ్స్ లేవన్నారు. డ్రగ్స్ విషయంలో తాము కఠినంగా ఉంటామనీ, దీని మూలాలను అన్వేషించే పనిలో పోలీసులు, ఎక్సైజ్ శాఖలు ఉన్నాయని సీఎం తెలిపారు. ఇప్పటికే డ్రగ్స్ వాడుతున్నవారు ఆ అలవాటు వదులుకోవాలని సూచించారు. డ్రగ్స్ కు సంబంధించి ఎవరైనా స్వచ్ఛందంగా సమాచారం ఇస్తే, వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడంతోపాటు బహుమతులు కూడా ఇస్తామన్నారు.
డ్రగ్స్ కేసు విషయంలో ప్రభుత్వం టోన్ మారుతున్నట్టుగా ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాడకం దారులను బాధితులుగా చూస్తామనీ, వారిని నేరస్థులుగా పరిగణించలేం అని సాక్షాత్తూ ముఖ్యమంత్రే భరోసా కల్పిస్తున్నారు! రెండో జాబితా తెరమీదికి రాగానే ప్రభుత్వం వాదన ఇలా మారిపోవడం గమనార్హం! అయితే, ఈ మాత్రం దానికి సినీ ప్రముఖుల విచారణ పేరుతో ఎందుకింత హడావుడి చేసినట్టు అనే ప్రశ్న వినిపిస్తోంది..? ఒకవేళ వాడకం దారులు బాధితులే అయినప్పుడు, వారి నుంచి సమాచారం రాబట్టడమే లక్ష్యం అయినప్పుడు.. హడావుడి లేకుండా ఆ పనేదో రహస్యంగా ఆ ఎందుకు చేయలేదు..? అంతేకాదు, ఈ కేసును సీఐడీకి అప్పగించాలని భావిస్తున్నారట. అదే జరిగితే ఇక అకున్ సబర్వాల్ ఎన్నాళ్లైనా సెలవు సెలవు పెట్టకోవచ్చు. డ్రగ్స్ కేసు విషయంలో మొదట్లో ఉన్న హడావుడి రానురానూ డైల్యూట్ అవుతోందని చెప్పడానికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలే సాక్ష్యం అనే విమర్శలు మరోసారి గుప్పుమంటున్నాయి.