తెలంగాణలో ప్రతిపక్షం ఉండకూడదన్న మిషన్ను కేసీఆర్ తాత్కాలికంగా సాధించారు. శాసన మండలిలో ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖతో.. కాంగ్రెస్ లేజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేసినట్లు… అసెంబ్లీ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసిన ఓ రోజు వ్యవధిలో.. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా తొలగిస్తూ.. ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటి వరకూ శాసనమండలిలో షబ్బీర్ అలీ ప్రతిపక్ష నేతగా ఉండేవారు. ఇప్పుడా హోదాను తప్పిస్తూ ఆదేశాలిచ్చారు. రాజ్యాంగ విరుద్ధంగా శాసన మండలి చైర్మన్ విలీన నిర్ణయం తీసుకున్నారని.. అలాంటి అవకాశమే లేదని చెబుతూ కాంగ్రెస్ పార్టీ కోర్టుకెళ్లేందుకు సిద్ధమయింది. న్యాయ, రాజ్యాంగ నిపుణులతో సంప్రదింపులు జరిపి పిటిషన్ రెడీ చేసుకుంటోంది. కాంగ్రెస్ కంటే వేగంగా.. టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకుంది.
గతంలో పార్టీ మారిన ఎంఎస్ ప్రభాకర్, దామోదర్ రెడ్డి పై వేటు వేయాలని కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ చైర్మన్ కు ఫిర్యాదు చేసింది. వారి పిటిషన్ ఇప్పటి కింకా చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉంది. అలాంటప్పుడు ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్సీలు ఇచ్చిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబడుతున్నారు. తమ పిటిషన్ పై ఇంతే వేగంగా ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో కోర్టు కేసులకు సంబంథించిన సమగ్ర సమచారాన్ని సేకరించి పిటిషన్ రెడీ చేసుకున్నారు. ఒక జాతీయ పార్టీని ప్రాంతీయ పార్టీలో విలీనం చేయలేరని అంటున్నారు. న్యాయస్థానంలో తమకు తగిన న్యాయం జరుగుతుందని గట్టి విశ్వాసంతో ఉన్నారు. 2014లో హరియాణ జనహిత్ కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. స్పీకర్ వారి పార్టీని కాంగ్రేస్ లో విలీనం అయినట్లు ప్రకటించారు. కానీ కోర్టు కొట్టేసింది. 2007లో పదమూడు మంది బీఎస్పీ ఎమ్మెల్యేలు సమాజ్ వాది పార్టీలో చేరినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఇలాంటీ తీర్పునే ఇచ్చిందంటున్నారు.
ఇప్పటికైతే.. తెలంగాణలో ప్రతిపక్షం లేదు. ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయలేదు. వారు ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మరో కాంగ్రెస్ ఎల్పీ ఏర్పాటవుతుంది. అయితే.. అప్పుడు ప్రతిపక్ష హోదా వస్తుంది. కానీ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం… ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం చేసే లోపుగానే…తుది విడత ఆకర్ష్ ను పూర్తి చేసి… ప్రతిపక్ష హోదా రాకుండా చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో.. కాంగ్రెస్ లో గుబులు ప్రారంభమయింది.