దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని తాము ఎప్పుడూ హామీ ఇవ్వలేదని.. మ్యానిఫెస్టోలో కూడా పెట్టలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ సాక్షాత్తూ అసెంబ్లీలోనే ప్రకటించడం వివాదాస్పదం అవుతోంది. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వడం అనేది కేసీఆర్ ఫ్లాగ్ షిప్ స్కీముల్లో ఒకటి. 2014లో దళితులంతా ఏకపక్షంగా ఆయనకు మద్దతు పలకడానికి ఈ హామీ కీలకం. ఆ తర్వాత ఈ హామీని అమలు చేయడానికి ప్రయత్నించారు కూడా.
కొంత మందికి ఇచ్చారు . ఎంత ఖర్చు అయినా కొనుగోలు చేసి ఇస్తామని పలుమార్లు ప్రకటించారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆ హామీ ఉంది. అయినప్పటికీ ఆయన ఆ హామీ ఇవ్వలేదని.. మేనిఫెస్టోలో ప్రకటించలేదని అసెంబ్లీలో చెప్పడం వివాదాస్పదం అవుంతోంది. సోషల్ మీడియాలో పలువురు టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రదర్శనకు పెడుతున్నారు. సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన పేపర్ క్లిప్పింగ్‌ను కూడా షేర్ చేస్తున్నారు.
2018 ముందస్తు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో కాపీలో ఉన్న షెడ్యూల్ కులాల సంక్షేమం అనే పేజీలో దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ ఉందని చెబుతున్నారు. కేసీఆర్ అలా ఎందుకు చెప్పారో కానీ టీఆర్ఎస్ నేతలు కూడా నమ్మలేకపోతున్నారు. దళితులకు మూడెకరాల హామీ అనేది బాగా అందరి నోళ్లలో నానిన హామీ అని ఇప్పుడు ఇవ్వలేదని చెబితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని వారు ఆందోళన చెందుతున్నారు.