హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఆవిష్కరించారు. ట్యాంక్‌బండ్‌పై అంబేద్కర్ విగ్రహం పక్కన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, టీఆర్ఎస్ నేతలు డీఎస్, కేశవరావు, వెంకటస్వామి కుమారులు వివేక్, వినోద్, అల్లుడు, మరో కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ శంకరరావుకూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకా సేవలను నేతలు స్మరించుకున్నారు. తెలంగాణ రావటానికి తీవ్రకృషి చేసిన పెద్దలు జయశంకర్, యాదగిరిరెడ్డి వంటివారు దురదృష్టవశాత్తూ రాష్ట్రం ఏర్పడకముందే చనిపోయారని, అయితే కాకా వెంకటస్వామిమాత్రం తెలంగాణను చూసే కన్నుమూశారని, ఆయన అదృష్టవంతుడని కేసీఆర్ అన్నారు. చిన్నస్థాయినుంచి అత్యున్నత స్థాయికి మనిషి ఎదగగలడనటానికి వెంకటస్వామి జీవితం నిదర్శనమని చెప్పారు. తెలంగాణలో అత్యున్నతస్థాయికి చేరుకున్న దళితనేత వెంకటస్వామి అన్నారు.
మరోవైపు వివేక్, వినోద్ కేసీఆర్‌కు దగ్గరవటం చూస్తుంటే వారు మళ్ళీ కారు ఎక్కబోతున్నారా అని ఊహాగానాలు సాగుతున్నాయి. వారు వాస్తవానికి మూడేళ్ళక్రితం టీఆర్ఎస్లో చేరినప్పటికీ, ఎన్నికలముందు మళ్ళీ కాంగ్రెస్‌లో చేరారు. ఇదిలాఉంటే, అంబేద్కర్ విగ్రహం పక్కన వెంకటస్వామి విగ్రహాన్ని పెట్టటాన్ని నిరసిస్తూ తెలంగాణ ఎమ్ఆర్పీఎస్ నేతలు ఆందోళనకు దిగటంతో ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీఆర్ బృందం వెళ్ళిపోయాక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆ ప్రదేశానికి చేరుకుని కాకా విగ్రహానికి నివాళులర్పించారు.