హైదరాబాద్: కొన్నిరోజులుగా మిత్రధర్మం పాటించిన తెలుగు చంద్రులు నిన్న మళ్ళీ కత్తులు దూసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సందర్భంగా పరస్పరం విమర్శలు గుప్పించుకున్నారు. ఇద్దరూ నిన్న గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారని ముందే సమాచారం బయటకొచ్చినప్పటికీ, ఇద్దరిలో కేసీఆర్ ప్రెస్ మీట్ మొదట ప్రారంభమయింది… మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో. చంద్రబాబు 4 గంటల ప్రాంతంలో పఠాన్ చెరువులో రోడ్ షోను ప్రారంభించారు. కేసీఆర్ తన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, చంద్రబాబుపై దాడికి దిగారు. అసలు చంద్రబాబుకు ఇక్కడేం పని అన్నారు. ఊడ్చుకోవాలంటే 13 జిల్లాలున్నాయని ఎద్దేవా చేశారు. ఆయన ఇక్కడ ప్రచారం చేయటం అసంబద్ధమని, వృథా ప్రయాస అని కూడా అన్నారు. మరోవైపు చంద్రబాబు గత కొన్ని రోజులుగా అనుసరించిన వైఖరినే కొనసాగిస్తూ కేసీఆర్పై విమర్శలేమీ చేయలేదు. అయితే ఇక్కడేం పని అంటూ కేసీఆర్ చేసిన విమర్శలపై స్పందించారు. కొంతమంది తనకు ఇక్కడేం పని అంటున్నారని, తాను ఎక్కడకీ వెళ్ళనని, ఇక్కడే ఉంటానని చెప్పారు(మరి ఏపీని ఏం చేస్తారో?).
అయితే చంద్రబాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు ఆయన రాజనీతిజ్ఞతకు తగ్గట్టుగా లేదనే ఒక వాదన వినిపిస్తోంది. ఆ వ్యాఖ్యలు గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్కు నష్టం కలిగించేవిధంగా ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాబట్టి హైదరాబాద్లో ఉన్న ఆంధ్రావాళ్ళందరూ తెలుగుదేశానికి అనుకూలురు అయినా కాకపోయినా కూడా చంద్రబాబును ఎద్దేవాచేస్తే వారి మనసు నొచ్చుకుంటుందని చెబుతున్నారు. ఈ వాదనలో వాస్తవం లేకపోలేదు. ఆంధ్రా ఓటర్లను నొప్పించకూడదనే కేటీఆర్, కవిత గ్రేటర్ ప్రచారంలో ఎక్కడా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేయటంలేదు. పైగా హైదరాబాద్ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు కృషిని ఎవరూ కాదనలేరని కూడా వారిద్దరూ ప్రచారంలో వేర్వేరు సందర్భాలలో వ్యాఖ్యానించారు. మరి ఇంత చిన్న విషయం కేసీఆర్కు ఎందుకు తెలియలేదో అర్థం కావటంలేదు. అదీ కాక ఎంత కాదన్నా తెలుగుదేశం రెండు రాష్ట్రాలలో ఉన్న పార్టీ. చంద్రబాబు పొరుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఇక్కడేం పని అనటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా లేదు. చంద్రబాబునే ఇక్కడేం పని అంటే రేపు ఆంధ్రావాళ్ళను మాత్రం అనరా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్న లేవనెత్తే అవకాశం కూడా ఉంది. మరి కేసీఆర్ వ్యాఖ్యల ప్రభావం గ్రేటర్ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లపై ఎంతమేర ఉంటుందో వేచి చూడాలి.