తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని… ఓ రాజకీయ వేడుకలా నిర్వహించాలనుకుంది. గత ఏడాదిలా.. నలభై ఐదు రోజుల పాటు గ్రామాల్లో డబ్బు పంపిణీని… ఓట్ల కొనుగోళ్ల కోసం జరిపే అధికారిక వేడుకలా నిర్వహించాలనుకుంది. ఎంత వడ్డించేవాడు మన వాడైనా కాస్త పరువు కోరుకుంటాడు కాబట్టి.. ఎన్నికల సంఘం.. కొన్ని ఆంక్షలు పెట్టింది. ఎవరికీ ఎలాంటి ప్రమేయం లేకుండా..నేరుగా లబ్దిదారుల ఖాతాలకు నగదు ఆన్లైన్లో బదిలీ చేసేయమని ఆదేశించింది. అంత సులువుగా చేసేస్తే… ఆశించిన లక్ష్యం ఎలా వస్తుంది..? అందుకే.. ఉన్నది ఆపద్ధర్మ ప్రభుత్వమే అయినా కుంటి సాకులు వెదకడం ప్రారంభించింది. దానికి సంబంధించి మీడియాకు లీకులు కూడా ఇస్తోంది.
రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బును ఎలా జమ చేయాలనే దానిపై వ్యవసాయ శాఖ దృష్టి కసరత్తు ప్రారంభించిందట. దాదాపు 50 లక్షల మంది రైతులు యాసంగి పెట్టుబడికి అర్హులు. వీరందరి బ్యాంకు ఖాతాలు వ్యవసాయ శాఖ దగ్గర లేవట. కాకపోతే రైతు సమగ్ర సర్వేలో, ధరణి వెబ్సైట్ ఆధారంగా 50 శాతానికిపైగా రైతుల బ్యాంకు ఖాతాలున్నట్లు ప్రాథమికంగా గుర్తించారట. అయితే ఇవి సరైనవేనా అనేది తెలియదట. మరీ కామెడీ కాకపోతే… ఇప్పుడు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ సిస్టమ్ వచ్చిన తర్వాత కూడా… రైతుల ఖాతాలు లేవని.. చెప్పడం కుంటి సాకు కాదా..? తెలంగాణలో సమగ్ర భూప్రక్షాళన జరిగింది., ప్రతి ఒక్క రైతులు కొత్త పాస్ బుక్ వచ్చింది. అందులో ఆధార్ నెంబర్ సహా అన్ని వివరాలు ఉన్నాయి. పుస్తకంలోఉన్నాయంటే.. పుస్తకంలో మాత్రమే ఉన్నాయని… రికార్డుల్లో ఉన్నాయి. నగదు పంపిణీ చేయాలంటే… ఒక్క గంటలో పని. సాంకేతిక ఇబ్బందులు వస్తే బ్యాంకర్లు.. క్షణాల్లో తీర్చేస్తారు.
కానీ ఈ కారణంగా చెప్పి.. ప్రతి ఒక్క లబ్దిదారు వద్దకు ప్రభుత్వ వ్యవసాయ అధికారిని పంపి… ఎన్నికల ప్రచారం చేయబోతున్నారన్న విమర్శలు ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ప్రతి గ్రామ రైతు బంధు లబ్ధిదారుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారులకు రెవెన్యూ సిబ్బంది అందించనున్నారు. ధరణికి అందుబాటులో ఉన్న రైతుల అకౌంట్ నంబర్లు కూడా అందులో ఉంచనున్నారు. ఏఈవోలు ప్రతి రైతును సంప్రదించి అకౌంట్ నంబర్ సరైందో కాదో నిర్ధారించుకొని, లబ్ధిదారుడైన రైతు బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకోని వాటిని రాష్ట్ర వ్యవసాయ శాఖకు పంపేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారట. అంటే వ్యవసాయ అధికారులు నేరుగా ప్రభుత్వానికి ప్రచారం చేయడమేనన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్ని వచ్చినా పట్టించుకోవడానికి.. అక్కడ ఈసీకి తీరిక ఉండదు.. గొంతు చించుకుకున్నా.. కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఏమీ ఉండదు..!