హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ప్రజలే బాస్‌లని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి గండిపల్లి, గౌరెల్లి రిజర్వాయర్లను పరిశీలించారు. తర్వాత ముల్కనూరులో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాల నాయకులు సమ్మెలు చేయిస్తున్నారని అన్నారు. ఈ నాయకులందరూ ఆయా పార్టీలలో గుమాస్తాలుగా చేసినవాళ్ళేగానీ, పార్టీకి అధ్యక్షుడిగాగానీ, ముఖ్యమంత్రిగాగానీ చేయలేదని ఎద్దేవా చేశారు. పారిశుధ్య కార్మికులు సమ్మె విరమించి విధుల్లోకి చేరాలని అన్నారు. రెండున్నర ఏళ్ళలో 1.5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పారు. ప్రాణహిత-చేవెళ్ళ తప్పుడు ప్రాజెక్ట్ అని, దీని రీ ఇంజనీరింగ్‌పై రాద్ధాంతం చేయొద్దని కాంగ్రెస్ నాయకులనుద్దేశించి అన్నారు. తోటపల్లి రిజర్వాయర్ రద్దు చేసినట్లు తానెప్పుడూ చెప్పలేదని, ఆ ప్రాజెక్ట్ కావాలా, వద్దా అన్నది ఇంజనీర్లే తేలుస్తారని అన్నారు.