ఏపీ, తెలంగాణ వేర్వేరు కాదు.. ఒకటే..!… ఈ మాట… ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన కేసీఆర్ నోటి నుంచి రావడం అనూహ్యమే. తమకు రావాల్సిన నీళ్లు, నిధులు, నియామకాలు ఏపీ దోచుకుపోయిందని.. పోరాడి.. ప్రత్యేక రాష్ట్రం సాధించిన తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇప్పుడు… ఏపీ, తెలంగాణ వేర్వేరు కాదు అనడం.. కచ్చితంగా అద్భుతమే. ఈ అద్భుతం… తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో జరిగింది. అదే సమయంలో ఈ మాట.. ఏపీ సీఎం నోటి వెంట కూడా వచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని, ఇద్దరం ఒకటేననే భావన కలిగి ఉండాలని, అదే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ చెప్పారు.
ప్రగతిభవన్లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ఏపీ, తెలంగాణ మధ్య గతంలో ఏం జరిగినా మర్చిపోవాలని నిర్ణయించుకున్నారు.
సహజ సరిహద్దు రాష్ట్రాలైన తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ కలిసి ముందడుగు వేయాలని నిర్ణయించుకున్నాయని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. విభజన సందర్భంగా తలెత్తిన అన్ని సమస్యలను సామరస్య పూర్వకంగా, సానుకూల దృక్పథంతో పరిష్కరించుకుంటామని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఖడ్గచాలనం అవసరం లేదని, కరచాలనం కావాలన్నారు. కత్తులు దూసేది లేదని, చేతులు కలపాలని చెప్పారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఇచ్చి పుచ్చుకునే విధంగా వ్యవహరించాలనేది తమ విధానమని, అదే విధానంతో మహారాష్ట్రతో వ్యవహరించి ఫలితం సాధించామన్నారు. తెలంగాణ, ఎపి కూడా అలాగే వ్యవహరించి రెండు రాష్ట్రాలకు మేలు కలిగే విధంగా వ్యవహరిస్తాయన్నారు.
ఉద్యోగుల విభజన, ప్రభుత్వ సంస్థల విభజన తదితర అంశాల పరిష్కార బాధ్యతను అధికారులకు అప్పగించారు. కాస్త నష్టమైనా త్వరగా పరిష్కరించాలని అధికారులకు జగన్ సూచించారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించే విషయంలో కేసీఆర్ అందిస్తున్న సహకారం చాలా గొప్పదని జగన్ ప్రశంసించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తాను హాజరయ్యే విషయంలో అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని, కానీ రెండు రాష్ట్రాలు కలిసి నదీ జలాలను రెండు రాష్ట్రాల్లోని సాగునీటి అవసరాలు తీర్చే విధంగా మలుచుకుంటే ఎంతో ఉత్తమమని తాను భావించి హాజరయ్యానన్నారు. సమావేశం తర్వాత ముఖ్యమంత్రులు మీడియాతో మాట్లాడలేదు.. కానీ.. మంత్రులు మాట్లాడారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తామని ప్రకటించారు. కేసీఆర్ ,జగన్ అన్నదమ్ముల్లా.. వ్యవహరిస్తూ..సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పుకొచ్చారు.