తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందస్తుగా వెళ్లడానికి పూర్తిగా సంసిద్ధులయ్యారు. అధికారికంగా చెప్పకపోయినా.. మొత్తానికి వంద శాతం క్లారిటీ ఇచ్చేశారు. సెప్టెబంర్‌లో అసెంబ్లీని రద్దు చేస్తే.. నవంబర్, డిసెంబర్లో జరగనున్న మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు… తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఖాయమే. వీటిపై తాను ఇప్పటికే కసరత్తు చేసినట్లు కేసీఆర్ చెప్పకనే చెప్పారు. పొత్తులు పెట్టుకునే అవకాశమే లేదని తేల్చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ గేమ్ ఛేంజర్‌గా ఉంది. ఆ పార్టీతో పొత్తు ఉంటే.. అడ్వాంటేజ్ అవుతుందన్న అంచనాలు… ప్రధాన పార్టీల్లో ఉన్నాయి. కొద్ది రోజుల కిందటి వరకూ.. తెలుగుదేశం పార్టీ.. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారం జరిగింది. ఇదే కారణాన్ని చూపి.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కానీ ఆ తర్వాత జాతీయ స్థాయిలో మారిన రాజకీయాలతో తెలంగాణలోనూ మార్పులొచ్చాయి.
జాతీయ స్థాయిలో బీజేపీకి గుడ్ బై చెప్పిన టీడీపీ.. ఇప్పుడు వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత చక్రం తిప్పాలనుకుంటోంది. దానికి కచ్చితంగా ఓ జాతీయ పార్టీ అండ ఉండాలి. ఇప్పటికే… దేశంలో పట్టనట్లుగా ఎదిగిన బీజేపీ.. ఒకరికి మద్దతవ్వడం అసాధ్యం. అందుకే.. గతంలో కొన్ని ఫ్రంట్లను ఏర్పాటు చేసినట్లుగా.. వచ్చే ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీల కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. కాంగ్రెస్ మద్దతు తీసుకుంటే.. ఏపీకి కావాల్సిన మద్దతు సాధించవచ్చని చంద్రబాబు తలపోస్తున్నారు. అందుకే పొత్తుల దాకా వెళ్లకపోయినా… కాంగ్రెస్ పార్టీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లోనూ మద్దతిచ్చారు. దీంతో.. తెలంగాణలోనూ ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చనే ప్రచారం ఊపందుకుంది. అదే సమయంలో… కేసీఆర్.. భారతీయ జనతా పార్టీకి, మోడీకి దగ్గరయ్యారు. ఓ వైపు బీజేపీకి దగ్గరై..మరో వైపు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం సాధ్యం కాదు. బీజేపీతో నేరుగా ఎన్నికల అవగాహనకు రాకపోవచ్చు కానీ… బీజేపీని మరోసారి ఢిల్లీ గద్దె ఎక్కకుండా చేయాలనుకుంటున్న టీడీపీతో జట్టుకట్టడం సాధ్యం కాదు. అందుకే కేసీఆర్ పొత్తులుండవని విస్పష్ట ప్రకటన చేశారు.
ఒక్క టీడీపీ మాత్రమే కాదు.. వామపక్షాలు, కోదండరాం పార్టీ సహా ఎవరూ టీఆర్ఎస్తో పొత్తు కోసం సిద్ధంగా లేరు. అలాగే ఎంఐఎం కూడా ఎప్పుడూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోదు. కానీ పార్టీ సహకారం మాత్రం పరోక్షంగా.. తమకు మిత్రులు అనుకున్నవారికి ఇస్తుంది. ప్రస్తుతం అలాంటి మితృత్వం.. టీఆర్ఎస్లో అసదుద్దీన్ కొనసాగిస్తున్నారు. అంటే.. ఓ వైపు బీజేపీతో పాటు..మరో వైపు ఎంఐఎంతోనూ… లోపాయికారీ రాజకీయాలతో .. కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారు. నేరుగా మాత్రం ఎవరితోనూ పొత్తులుండవు.