తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల తిరుపతి సందర్శించినప్పుడు ప్రభుత్వ ఖర్చుతో స్వంత మొక్కులు తీర్చుకున్నారని చాలా విమర్శలు వచ్చాయి. వాటిపై సరైన సమాధానం కూడా రాలేదు. ప్రశ్న వేయడమే తప్పయినట్టు తిట్టిపోశారు గాని భక్తి భావం రీత్యానూ రాజ్యాంగ రీత్యానూ అదెలా సమంజసమో చెప్పిన వారు లేరు. ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గర సిపిఆర్వో గా వుంటూ త్వరలో బ్రాహ్మణ పరిషత్ ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళ్తున్న వనం జ్వాలా నరసింహరావు కూడా ఒక పెద్ద వ్యాసం రాశారు గాని అందులోనూ ఈ సమాధానం లేదు. సరే ఆ సంగతి అటుంచితే కెసిఆర్ తిరుపతికి అంత భక్తితో వెళ్లి తలనీలాలు ఇవ్వకుండా రావదమేమిటని చాలామందికి సందేహం కలిగింది. గతంలో ఎన్టీఆర్ కిరణ్‌కుమార్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి వంటి వారు తలనీలాలు ఇచ్చిన సందర్బాలున్నాయి. మరి భక్తికి మారుపేరైన కెసిఆర్ ఎందుకు ఇవ్వలేదు? ఆయన పూర్వ సన్నిహితులొకరు ఈ ప్రశ్నకు చిటికెలో సమాధానం చెప్పేశారు. కెసిఆర్‌కు కత్తి అంటే భయమట. దాన్ని దగ్గరకు కూడా రానివ్వరట. కత్తి మాత్రమే గాక చాలామందికి లాగే ఆయనకూ బల్లి ఎలుక వంటి వాటిని చూసినా చచ్చేంత భయమేనట. సో భయభక్తులంటారు గాన భయమే భక్తికన్నా పై చేయి సాదించిందన్నమాట.