కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో రైతు బంధు స్కీమ్‌ను ఎన్నికలకు ముందుగానే ప్రారంభించారు. అప్పటికే ఓ విడత రైతు బంధు ఇచ్చి.. రెండో విడత ఖచ్చితంగా ఎన్నికల సమయంలో .. అదీ కూడా ఓటింగ్ జరగడానికి ముందుగా రైతుల చేతికి చెక్కులు అందేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అది పాత పథకం కాబట్టి ఆపడానికి ఈసీ కూడా అవకాశం లేకుండా చేశారు. ఆ రైతు బంధు చెక్కులు ఓట్ల పంట పండించింది. మళ్లీ అధికారంలోకి వచ్చారు.
కేసీఆర్ ఇప్పుడు కూడా అలాంటి ప్లానే అమలు చేస్తున్నారు. ప్రకటించిన పథకాలన్నీ అమలు ప్రారంభించేస్తున్నారు. మైనార్టీ బంధు పథకాన్ని పదహారో తేదీన ప్రారంభిస్తున్నారు. ఆ రోజు నుంచి చెక్కులు జారీ చేస్తారు. గృహలక్ష్మి పథకం కింద రూ. మూడు లక్షల చెక్కులకు దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు. త్వరలో పథకం ప్రారంభమవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం వద్ద వివిధ పథకాల కోసం … లక్షల సంఖ్యలో దరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్నాయి. వారిలో కొంత మందికి డబ్బులు ఇచ్చి.. మిగిలిన వాళ్లందరికీ ఎన్నికలు అయిపోగానే ఇస్తామని చెప్పడం కామనే.
సాధారణంగా డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంటే అక్టోబర్ లో నోటిఫికేషన్ వస్తుంది. కానీ.. అక్టోబర్ లోనే ఎన్నికలు జరుగుతాయని… ఈ నెలాఖరు లేదా.. వచ్చే నెల మొదట్లోనే నోటిఫికేషన్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే పథకాల అమలును చకచకా ప్రారంభిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ వ్యూహం ప్రకారం.. ఓటింగ్ కు ముందు పెద్ద ఎత్తున లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా పథకాలను ప్రారంభిస్తున్నారని భావిస్తున్నారు.