తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. మీడియాకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. హద్దు దాటితే చూస్తూ ఉరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా మీడియా సెల్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టే వార్తలు ప్రసారం చేస్తే.. వివరణ కూడా అడగకుండా.. కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులకు అధికారం ఇచ్చేశారు. ఇప్పటికే.. కత్తి మహేష్, పరిపూర్ణానంద వివాదంలో.. అసలు చిచ్చు పెట్టింది.. ఓ టీవీ చానలేనని నిర్దారించి ఇప్పటికే నోటీసులు కూడా పంపారు. దాన్ని అంతటితో ఆపకుండా..సరైన వివరణ ఇవ్వకపోతే.. చర్యలు కూడా తీసుకోవాలని పోలీసులను కేసీఆర్ ఆదేశించారు.
ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో… కొన్ని పార్టీలు.. మత ఉద్వేగాలు రెచ్చగొట్టి లబ్దిపొందే ప్రయత్నం చేస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందుకే మత ఘర్షణలకు ఊతమిచ్చే వారిపై ఉక్కుపాదం మోపాలని కేసీఆర్ నర్ణయించారు. ప్రజలు కలిసి మెలిసి జీవించే వాతావరణాన్ని కలుషితం చేసే వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ క్రమంలోనే బహిష్కరణలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో కేసీఆర్.. తన మత విశ్వాసాలను కూడా అదుపులో ఉంచుకున్నారు. సీఎం కేసీఆర్.. పరిపూర్ణానందను గౌరవిస్తారు. ప్రగతిభవన్‌కు పిలిచి సత్కరించి.. పాదనమస్కారం చేసి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయినా పరిపూర్ణానంద విషయంలో బహిష్కరణ నిర్ణయానికి కేసీఆర్ ఆమోదం తెలిపారు.
అసలు ఈ చిచ్చుకు మీడియానే కారణమని కేసీఆర్ గట్టిగా నమ్ముతున్నారు. అందుకే మత చిచ్చు రేగేలా మీడియాలో ప్రసారం, ప్రచురితమవుతున్న వార్తలను ఎప్పటికిప్పుడు పరిశీలించి, సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవటానికి ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెల్ బాధ్యులు రాష్ట్రంలోని అన్ని టీవీ న్యూస్ చానళ్ల ప్రసారాలను అనుక్షణం వీక్షిస్తున్నారు. పత్రికల్లో మతాలకు సంబంధించి వస్తున్న వార్తలను గమనిస్తున్నారు. గతంలో తమ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ..టీవీ 9, ఏబీఎన్ చానళ్లకు కేసీఆర్ అనధికారికంగా బ్యాన్ చేశారు. ఆ రెండు చానళ్లు చాలా కాలం పాటు.. తెలంగాణలో ప్రసారాలు చేయలేకపోయాయి. అది మొదటి ప్రమాద హెచ్చరిక అనుకుంటే.. ఇప్పుడు కేసీఆర్ రెండో ప్రమాద హెచ్చరిక వినిపించినట్లేనని..మీడియా, రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.