కవిత, సంతోష్‌లతో సహా ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ అధికారికంగా ఎవరితోనూ భేటీ అయనట్లుగా సమాచారం లేదు. రెండు రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ఓ రోజు బీఆర్ఎస్ కోసం లీజుకు తీసుకున్న భవనాన్ని.. మరో రోజు సొంతగా కడుతునన్ భవనాన్ని పరిశీలించారు. ఆ నిర్మాణం మరో ఏడాదికి పూర్తయ్యే అవకాశం ఉంది. మిగతా సమయాల్లో ఆయన ఎవరితో భేటీ అవుతున్నారో టీఆర్ఎస్ వర్గాలు క్లారిటీ ఇవ్వడం లేదు. ఆయన చాలా బిజీగా ఉన్నారని.. ఖాళీగా మాత్రం లేరని చెబుతున్నారు.
బీఆర్ఎస్ను ఇతర రాష్ట్రాల్లో విస్తరించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఢిల్లీలో ఉత్తరాదికి చెందిన కొంత మంది రాజకీయేతర ప్రముఖులతో మాట్లాడుతున్నారని వారిని పార్టీలో చేర్చుకుని బాధ్యతలిచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. మరో వైపు ఆయన కొన్ని సొంత వ్యవహారాలనూ చక్క బెడుతున్నారని చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న అభిషేక్ రావు చుట్టూ ఇప్పుడు దర్యాప్తు నడుస్తోంది. ఆయనచాలా కీలక విషయాలు చెప్పారని సీబీఐ నుంచి లీకులొస్తున్నాయి. ఇందులో ప్రధానంగా కుటుంబసభ్యుల పేర్లు కూడా ఉండటంతో కేసీఆర్ .. కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
కేసీఆర్ ఎన్ని రోజులు ఢిల్లీలో ఉంటారో స్పష్టత లేదు. కానీ కీలకమైన సమావేశాలు నిర్వహిస్తున్నా.. అవి అంతర్గతంగానే ఉంటున్నాయి. ఏ రాజకీయ పార్టీ నేతతోనూ బహిరంగంగా సమావేశం కాలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన తర్వాత కేసీఆర్ ఇంత వరకూ మీడియాతో మాట్లాడలేదు. ఆయన మాట్లాడతారేమో అనుకుంటున్నారు కానీ.. ఇంత వరకూ అలాంటి సూచనలు కూడా లేవు.