ప్రగతి నివేదన సభకు.. తెలంగాణ రాష్ట్ర సమితి చాలా హైప్ తీసుకొచ్చింది. తాము ప్రపంచంలోనే ఓ అద్భతమైన సభను నిర్వహించబోతున్నామని ప్రకటించింది. దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేశారు. ఇరవై ఐదుల లక్షల నుంచి ఇరవై ఏడు లక్షల మంది వస్తారని ప్రచారం చేశారు. ఈ ప్రచారంతో పోలిస్తే… సభ జరిగిన విధానం చూస్తే.. కచ్చితంగా… నిరాశపరిచేదే. భారీ సభలు ఏ రాజకీయ పార్టీ పెట్టినా వస్తారు. అది కూడా.. అధికార పార్టీ నిర్వహిస్తే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఎందుకంటే..అధికారం మొత్తం వారి చేతుల్లో ఉంటుంది.. అన్ని వ్యవస్థలూ సహకరిస్తాయి.
సభలో ప్రగతి నివేదన ఎక్కడ ఉంది..?
ప్రగతి నివేదన సభకు… అంచనాలు వేసిన దాని కన్నా.. చాలా చాలా తక్కువ మంది వచ్చారు. అలాగే..కేసీఆర్ వచ్చినప్పుడు కానీ ప్రసంగించినప్పుడు కానీ గొప్ప రెస్పాన్స్ ఉండాలి. కానీ ఆ రెస్పాన్స్ రాలేదు. అలాగే.. కేసీఆర్ సహజసిద్ధమైనా స్పీచ్ ఇవ్వలేదు. తను అనుకున్నది…స్పష్టంగా చెప్పగలిగే సామర్థ్యం.. కేసీఆర్‌కు ఉంది. కానీ ఆయన చెప్పలేకపోయారు. దీనికి కారణం… సభకు పెద్దగా జనం రాకపోడమా మరో కారణమా అన్నది తెలియదు. ఇక ప్రగతి నివేదన సభ అన్నప్పుడు ప్రత్యేకంగా ఏమైనా చెబుతారా… అన్న ఆసక్తి ప్రజల్లో ఉంటుంది. ప్రగతి నివేదన అంటే.. ప్రొగ్రెస్ రిపోర్ట్. జరిగిన ప్రోగ్రెస్ ఏమిటి.. ఇంకా ఏం చేస్తాం అన్నది చెప్పలేకపోయారు. ఉదాహరణకు.. డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇన్ని కటిస్తామన్నాం.. కొన్నే కట్టించాం..త్వరలో కట్టిస్తాం.. అని చెప్పే ప్రయత్నం జరగాలి. ఇలా అన్ని ప్రాజెక్టులు, ఫథకాలు విషయాల్లో వివరాలు చెప్పి ఉన్నట్లయింతే.. ప్రజల్లో కొంచెం క్లారిటీ వచ్చేది. ఇసుక గురించి చెప్పారు.. కానీ అది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. ప్రజలకే ఏమీ రాదు. అలాగే.. ఇతర పథకాల విషయంలో కూడా అంతే. తమ ప్రగతి ఏదో స్పెసిఫిక్‌గా ఏదీ చెప్పలేదు.
ఏం చేయబోతున్నామో కూడా చెప్పలేదు..?
కొత్తగా ఏం చేయబోతున్నారో చెబుతారని ప్రజలు ఆశించారు. కానీ ఇది వరకు ఎన్నో ఉపన్యాసాల్లో చెప్పినవే చెప్పుకొచ్చారు. కొత్త అంశాలు ఏమీ లేవు. అన్ని లక్షల మందిని హైదరాబాద్ నుంచి పిలుచుకొచ్చి.. వారికి ఏమీ చెప్పినట్లు..? ప్రతీ రోజూ.. టీవీల్లో, పేపర్లలో చెప్పినవే. అవన్నీ పిలిచి… కొత్తగా ఏమీ చెప్పకుండా.. ఎందుకు ఉన్నట్లు..?. అందర్నీ పిలిచినప్పుడు ఓ కొత్త విషయం చెప్పాలి. లేకపోతే నిరాశ పడతారు. జనం యాక్సెప్ట్ చేయరు. ఇంకా అందరూ గుర్తించింది ఏమిటంటే.. కేసీఆర్ సహజ శైలిలో మాట్లాడలేదు. ఎన్నికలకు ముందు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభలో కేసీఆర్.. తన సహజ సిద్ధమైన ప్రసంగం మాత్రం చేయలేదు. దీనికి కారణం ఏమిటన్నదానిపై రకరకాల విశ్లేషణలు వచ్చాయి. జనం రాలేదన్న నిరాశ అని కొంత మంది విశ్లేషిస్తున్నారు. అలాగే వారం రోజుల నుంచి తెప్పించుకుంటున్న గ్రౌండ్ రిపోర్టులు కూడా కారణం కావొచ్చు. అయినా సరే జనం రాకపోవడం అన్నది కచ్చితంగా సందేహించాల్సిన విషయమే.
ముందస్తుకు వెళ్తారో లేదో.. ఎందుకు చెప్పలేదు..?
ముందస్తు ఎన్నికల గురించి.. సభలో ప్రకటించి ఉంటే.. సభకు ప్రాధాన్యత వచ్చి ఉండేది కాదు. ముందస్తుకు మాత్రమే ప్రయారిటీ … వస్తుంది. ఇంత భారీగా చేసిన సభ కాబట్టి.. దానికి ప్రాముఖ్యత రావాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రకటించలేదని కొంత మంది చెబుతున్నారు. అలాగే.. ఇంత మందిని పిలుచుకుకు వచ్చినప్పుడు.. స్ఫూర్తి నింపేందుకు.. ముందస్తు ప్రకటించి ఉండాల్సింది అని కొంత మంది అంటున్నారు. అసలు కేసీఆర్ మనసులో ఏముందో… ఎవరికీ తెలియదు. టీఆర్ఎస్ నేతలకు కూడా తెలియదు. గతంలో చాలా మంది నేతలు.. ముందస్తుకు పోతున్నామని ప్రకటించారు. నిప్పు లేనిదే పొగరాదు. కచ్చితంగా ముందస్తుకు వెళ్లే ఆలోచన ఉంది. అయితే ఎప్పుడు ప్రకటించాలన్నదానిపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. భారీగా జనసమీకరణ జరకపోవడంతో.. పరిస్థితులను విశ్లేషించుకుని ముందస్తుకు వెళ్తారా లేదా.. అన్నది మరో వారం పది రోజుల్లో తేల్చుకునే అవకాశం ఉంది.
ఇప్పటి వరకూ చేసింది ఢిల్లీకి గులాం గిరీ కాదా..?
ఢిల్లీకి గులాం కాదని.. కేసీఆర్ చెప్పుకొచ్చారు కానీ.. తెలంగాణ అంశాలపై… ఎందుకు కేంద్రాన్ని నిలదీయలేకపోయారు. బయ్యారం స్టీల్ ప్లాంట్ సహా ఒక్క విభజన హామీ అమలు చేయకపోయినా.. కేసీఆర్ ఢిల్లీని నిలదీయలేదు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రద్దు చేసినా మాట్లాడలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం.. జాతీయ ప్రాజెక్టు కోసం డిమాండ్ చేయలేదు. పాలమూరు ప్రాజెక్ట్‌కు సుష్మాస్వరాజ్.. ఎన్నికల ప్రచార సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. అలాగే.. ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోలేదు. ఇవే కాదు.. ఈ నాలుగేళ్ల కాలంలో.. కేంద్రాన్ని ప్రశ్నించడంతో పూర్తిగా విస్మరించారు. జోనల్ విషయంలో… ఇస్తవా.. చస్తావా అని నిలదీసి తెచ్చానన్నారు. మరి మిగతా డిమాండ్లన్నీ ఎందుకు అలా తీసుకు రాలేదు. ఇదే కాదు.. దేశవ్యాప్తంగా.. ప్రభావం చూపిన.. జీఎస్టీ, పెట్రో ధరలు లాంటి వాటిపైనా ప్రశ్నించలేదు. ఇవి తెలంగాణ ప్రజలపై కూడా ప్రభావం చూపాయి. అయినా సరే… కేంద్రంపై పోరాడలేదు. అదే సమయంలో.. ఇలాంటి సీరియస్ అంశాల్లో.. తమిళనాడు అత్యంత తీవ్రంగా స్పందించింది. ఆ రాష్ట్రాన్ని స్ఫూర్తిగా చెబుతున్న కేసీఆర్.. తమిళనాడు స్థాయిలో ఎందుకు విమర్శించలేదు. ప్రశ్నించలేదు. నిలదీయలేదు. కాంగ్రెస్ , బీజేపీలకు వ్యతిరేకమైతే.. ఒక్క కాంగ్రెస్‌నే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీని ప్రశ్నించడం లేదు.
చేయని వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు..?
సభలో కేసీఆర్ మాట్లాడిన దాని కన్నా..మాట్లాడిన దానిపైనే ఇప్పుడు ఎక్కువ చర్చ. ఆయన ఇచ్చిన హామీల్లో.. కేజీ టు పీజీ విద్య దగ్గర్నుంచి… దళితులకు మూడెకరాల భూమి వరకూ చాలా హామలు నెరవేరలేదు. ఇక నిరుద్యోగులతో ఓ వేదన. వీటన్నింటిని స్పందించి.. ఇప్పటి వరకూ ఇన్ని చేశాం..ఇక ముందు ఇలా చేస్తాం అని చెప్పి ఉంటే.. అది ప్రగతి నివేదన సభ అయ్యేది. కానీ ఏదీ చెప్పలేదు. అందుకే ఆయన మాట్లాడనివాటిపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. అందుకే విమర్శలు వస్తున్నాయి. టీఆర్ఎస్ బల ప్రదర్శన చేయాలనుకుంది. చేసింది. కానీ ఆశించినంత బలాన్ని ప్రదర్శించలేకపోయారు. జాతీయ రాజకీయాల్లో తాను పెట్టిన ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తీసుకు రాలేదు. ఎందుకు తీసుకు రాలేదు..? ఎవరికైనా అనుమానం వస్తుంది కదా..?. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నామని చెబుతున్నప్పుడు.. ఎందుకు మాట్లాడలేదు…?. దేశ్‌కి నేత కేసీఆర్ అనే నినాదాన్ని ఎందుకు వినిపించలేదు. ..?. చివరికి.. ప్రతిపక్షాలను విమర్శించిన దాంట్లోనూ.. కేసీఆర్ పదును చూపించలేకపోయారు.
వంద సీట్లు వస్తాయని ఎందుకు చెప్పుకోలేకపోయారు..?
2014 లో ఉన్న స్థాయిలో తెలంగాణ సెంటిమెంట్ లేదు. జయశంకర్ సార్ ప్రస్తావన తీసుకొచ్చారు. తెలంగాణ ఆత్మ అన్నారు. మరి అలాంటి ఆయనకు ఏమైనా.. స్మారకం ఉంది. జయశంకర్ లేకుండా.. తెలంగాణ ఉద్యమం లేదు. తెలంగాణ రాష్ట్రం లేదు. ఓ యూనివర్శిటీకి.. ఓ జిల్లాకు పేరు పెట్టినంత మాత్రాన.. ఆయనకు గౌరవం ఇచ్చినట్లేనా..?. హైదరాబాద్‌లో రెండు రిజర్వాయర్ల దగ్గర్నుంచి ఎన్నో చేస్తారన్నారు. కానీ ఏ ఒక్కటీ చేయలేదు. అందుకే అనేక ప్రశ్నలొస్తున్నాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే… మళ్లీ అధికారంలోకి రాబోతున్నాం అని గట్టిగా చెప్పలేకపోయారు. అన్ని లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి ఎందుకు చెప్పలేకపోయారు..?. ఎమ్మెల్యేలు అందరూ వేదికపై ఉన్నారు. వీరందరికీ టిక్కెట్లు ఇవ్వబోతున్నామని.. చెప్పి.. అందర్నీ ఆశీర్వదించండి అని ఎందుకు చెప్పలేదు. అలాగే.. వంద సీట్లు వస్తాయని.. ప్రెస్మీట్లలో చెబుతూంటారు. కానీ… వేదికపై మాత్రం చెప్పలేదు.
ప్రభుత్వ పనితీరును బట్టే ఓట్లేస్తారు..!
సెంటిమెంట్ అనేది గత ఎన్నికల్లో చూపించినంత ప్రభావం 2019లో చూపించదు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పాలన మీద ఓటేస్తారు. టీఆర్ఎస్ ఎలా చేసింది.. మళ్లీ అవకాశం ఇవ్వొచ్చా లేదా అన్నదే చూస్తారు. తెలంగాణ ఉద్యమం ఎందుకు ప్రజల్లోకి వెళ్లిందంటే.. ప్రతీ సమస్యకు.. సమైక్య రాష్ట్రమే కారణమని చెప్పారు. సహజంగానే.. తెలంగాణ వస్తే.. మొత్తం మారిపోతుందని భావించారు. ఉద్యోగాలు రాలేదు. ఉద్యమ సమయంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలొస్తాయని నమ్మారు. తెలంగాణ వస్తే.. అన్నీ వస్తాయని నమ్మారు. కానీ ఆశించింది జరగడం లేదు. ఇవన్నీ చూసుకునే ప్రజలు తీర్పు ఇస్తారు.