తన కుమార్తెను కూడా బీజేపీలోకి రావాలని బెదిరించారని..ఇంత కంటే దుర్మార్గం ఉంటుందని టీఆర్ఎస్ అధినేత కేటీఆర్ .. పార్టీ కార్యవర్గ సమావేశంలో వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. కవితపై ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు వచ్చిన తర్వాత కేసీఆర్ ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. బహిరంగంగా కానీ.. పార్టీ నేతలతో కానీ ఎప్పుడూ మాట్లాడలేదు. అయితే కార్యవర్గ సమావేశంలో మాత్రం కవిత అంశాన్ని ప్రస్తావించారు. ఈడీ దాడులు చేసిన తర్వాత కవితను బీజేపీలోకి రావాలని ఒత్తిడి చేసినట్లుగా కేసీఆర్ చెప్పారు. ఇంత కంటే దుర్మార్గం ఏముంటుందని ఆయన వ్యాఖ్యానించడం టీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఐటీ, ఈడీ, సీబీఐ దాడుల గురించి చెబుతూ.. కేసీఆర్ ఈ వ్యాఖ్యలుచేసారు. బీజేపీతో ఇక యుద్ధమే ఉంటుందని.. బీజేపీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తోంది..జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఐటీ, ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని అయినప్పటికీ భయపడవద్దని.. ఆందోళనకు గురి కావొద్దని ఎమ్మెల్యేలకు ముఖ్య నేతలకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలపై గురి పెట్టారని.. వారి పేర్లను సమావేశంలో కేసీఆర్ వివరించినట్లుగా చెబుతున్నారు. ఫిర్యాదులు బీజేపీ నేతలే చేయించి.. దాడులు చేస్తారని కేసీఆర్ అంచనా వేశారు. ప్రస్తుతం బీజేపీతో జరుగుతున్న పోరాటం ముందు ముందు ఇంకా ఎక్కువగా జరుగుతుది కావున.. పొరపాట్లు చేయవద్దని సూచించినట్లుగా తెలుస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను ఇరికించడానికి కారణం పార్టీ మారడానికి అంగీకరించకపోవడమేనన్న అర్థంలో కేసీఆర్ చెప్పినట్లుగా ఉండటం కూడా చర్చనీయాంశమవుతోంది. మరో వైపు ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలు ఉండని కేసీఆర్ స్పష్టం చేశారు. మరో పది నెలల్లో ఎన్నికలు ఉంటాయని.. అందరూ జనంలోనే ఉండాలని ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలెవరూ ఆందోళన చెందవద్దని.. అందరికీ మళ్లీ అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.