ఏపీలో రాజకీయం అంతా అధికారుల్ని అడ్డం పెట్టుకునే చేస్తున్నారు. ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పోస్టింగ్లు భయంతో ప్రభుత్వం ఏం చేయమన్నా చేస్తున్నారు. ఏ రకమైన స్టేట్మెంట్లు ఇవ్వమన్నా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం ఆ సివిల్ సర్వీస్ అధికారులందర్నీ తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. కేడర్ రూల్స్ మార్చేస్తోంది. ఎప్పుడు కేంద్రానికి రావాలంటే అప్పుడు వచ్చేలా రూల్స్ మార్చేస్తోంది. దీన్ని బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఎలాగూ వ్యతిరేకించలేవు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి.
ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకించి తీరాలి. లేకపోతే కీలకమైన సివిల్ సర్వీస్ అధికారులు కేంద్రం గుప్పిట్లోకి వెళ్లిపోతారు. అప్పుడు చేయడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేడర్ రూల్స్ మార్పును అంగీకరించబోమన్నారు. కేసీఆర్ మాత్రమే కాదు కేరళ జార్ఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్గఢ్ చివరికి బిహార్లో బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం స్వాగతించాలన్న ఆలోచనలో ఉన్నారు.
మొత్తం కేంద్రం గుప్పిట్లోకి తీసుకున్నా ఎందుకు స్వాగతించే ఆలోచనలో ఉన్నారో ఏపీ ప్రజలకు బాగానే తెలుసు. కానీ హక్కులన్నీ ధారాదత్తం చేసి తర్వాత తమను తాము ఎలా కాపాడుకుంటారన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. కేంద్రానికి ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేని దుస్థితిని ఆసరా చేసుకుని కేంద్రం కూడా ఒక్కో ఆధికారాన్ని వెనక్కి తీసుకుంటోంది. రేపు తేడా వస్తే ఏపీలో అధికారంలో ఉన్నా లేనట్లేనన్న పరిస్థితి వస్తుంది.