డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. కొంతమంది సినీ ప్రముఖుల పేర్లు బయటకి రావడంతో మీడియాలో పెద్ద ఎత్తున ప్రాధాన్యత లభించింది. అయితే, రాజకీయంగా కూడా ఈ కేసు ఆసక్తికరంగానే మారింది! డ్రగ్స్ దందా విషయంలో మొదట్నుంచీ క్రియాశీలంగా ఉంటూ వస్తున్న అకున్ సబర్వాల్, కీలక సమయంలో సెలవు అనడంతో విమర్శలు తలెత్తాయి. ఈ కేసు కూడా గతంలోని ఓటుకు నోటు కేసు మాదిరిగా, గ్యాంగ్ స్టర్ నయీం కేసు తరహాలోనే సర్కారు నీరుగార్చేస్తుందన్న విమర్శలొచ్చాయి. వెంటనే తెరాస స్పందించింది. అకున్ సబర్వాల్ సెలవును రద్దు చేసుకోమని చెప్పడంతోపాటు, ఆయన లీవ్ క్యాన్సిల్ చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడీ కేసుపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఘాటుగా స్పందించడం విశేషం. కేసును కేసీఆర్ సీరియస్ గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.
ఈ కేసు విషయంలో దూకుడు తగ్గొద్దనీ, అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. డ్రగ్స్ కేసులో ఎంత పెద్దవారున్నారు, తెరాస నాయకులున్నా, చివరికి మంత్రులు పేర్లు ఉన్నా కూడా చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ప్రగతీ భవన్ లో ఉన్నత స్థాయి అధికారులతో సమావేశంలో ఈ మేరకు కేసీఆర్ స్పందించారు. డ్రగ్స్ తోపాటు, కల్తీ కేసుల్లో దోషులకు జీవిత ఖైదు విధించేందుకు అనువుగా కొత్త చట్టాలను తేవాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. డ్రగ్స్, కల్తీలను పూర్తిస్థాయిలో నియంత్రించాలనీ, అంతవరకూ అధికారులు విశ్రమించొద్దని సీఎం కోరారు. ఈ దందాల విషయంలో ఎవ్వరినీ కాపాడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేశారు. కేసు కీలక దశలో దర్యాప్తు జరుగుతున్న సమయంలో అకున్ సబర్వాల్ సెలవులో వెళ్తానంటే, తానే వెళ్లొద్దని సూచించానని సీఎం చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేయాలని అకున్ సబర్వాల్ ను ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కోరారు.
డ్రగ్స్ కేసులో విమర్శలు పెరుగుతున్నాయీ… నీరుగారే ప్రయత్నాలు జరుగుతున్నాయీ అనే అనుమానాలు వ్యక్తమౌతున్న తరుణంలో వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగారు. రాజకీయంగా తమకు తెరాసకు ఎలాంటి చెడ్డపేరు రాకూడదనే ఉద్దేశంతోనే అకున్ సబర్వాల్ సెలవును ఆపారని చెప్పాలి. ఎంతటి వారికైనా శిక్ష తప్పదని ఇప్పుడు అంటున్నారు. ఇదీ మంచిదే. సో.. నయీం కేసు, ఓట్ ఫర్ నోటు కేసు విషయంలో మాదిరిగా విమర్శలు గుప్పించే ఛాన్స్ ప్రతిపక్షాలు ఇకపై ఇవ్వరన్నమాట! రాజకీయాల మాట ఎలా ఉన్నా.. డ్రగ్స్ లాంటి వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరించాల్సిందే..!