పంచాయతీ, మున్సిపల్ చట్టాలను కేసీఆర్ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఉప సర్పంచులకు జాయింట్ గా చెక్ పవర్ ఇవ్వడం లాంటి అంశాల మీద చాలామంది సర్పంచులు అసంతృప్తిగా ఉన్నారు. దీన్ని మార్చకపోతే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామంటూ కొంతమంది సర్పంచులు బెదిరిస్తున్నారు. ఇంకోపక్క ఉద్యోగ సంఘాల నుంచి కూడా కొంత ఒత్తిడి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చట్టాలు అమలుకు ఆటంకం అనుకుంటే ఎవర్నైనా తొలగిస్తామనీ, ఛైర్మన్లు సర్పంచులు ఉద్యోగులు.. ఎవరైనాసరే వేటు తప్పదని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై వ్యతిరేకత వ్యక్తమౌతోందనీ, పార్టీకి కూడా ఇది మంచిది కాదంటూ కేసీఆర్ కి సొంత పార్టీ నేతలు కొందరు చెప్పే ప్రయత్నం చేశారట..! వారితో కూడా తానే చెప్తే అదే ఫైనల్ అనీ, మార్పులుండవ్ అని తెగేసి చెప్పినట్టు సమాచారం.
సర్పంచులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తే నష్టపోయేది వారేననీ, వారి పదవులే పోతాయనీ, వారి స్థానంలో ఉప సర్పంచులకు పవర్స్ వస్తాయని కేసీఆర్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకా మొండికేస్తే ఏమైతది, ఆర్నెలల్లో ఎలక్షన్లు పెట్టుకోవచ్చనీ, నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. వారేదో చేస్తరని భయపడుతుంటే అందరూ బెదిరిస్తూనే ఉంటారనన్నారు. వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రక్షాళన జరగాల్సిందే అన్నారు. దానికోసం మొండిగా వెళ్లినా తప్పులేదనీ, మహా అయితే మనల్ని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తారనీ, ఇప్పటికే రెండుసార్లు అధికారంలో ఉన్నాం, ఓసారి ప్రతిపక్షంలో కూర్చుంటాం అంతే అని కొందరు నేతలతో కేసీఆర్ చెప్పారని సమాచారం. ఉద్యోగుల విషయమై మాట్లాడుతూ… తెగేదాకా దేన్నీ లాగొద్దని ఉద్యోగ సంఘాలకు చెప్పండి అంటూ కొందరు నేతలకు కేసీఆర్ చూచించినట్టు సమాచారం. వాళ్లు ప్రభుత్వానికి ఏదో చేస్తున్నామని భ్రమల్లో ఉండొద్దని చెప్పమనీ, ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పని చెయ్యకపోతే ఎవ్వర్నైనా ఇంటికి పంపేస్తామన్నారు.
కేసీఆర్ తాజా వైఖరితో పార్టీ మీద కొంత వ్యతిరేకత వ్యక్తమౌతోందని తెరాస నేతలే కొందరు ఆందోళన చెందుతున్నారు. కానీ, కేసీఆర్ దాన్ని ప్రస్తుతానికి పట్టించుకునే పరిస్థితిలో ఉన్నట్టు లేరన్నది వాస్తవం! ఓపక్క సర్పంచులు, ఛైర్మన్లు, మరోపక్క ఉద్యోగులు కేసీఆర్ తాజా వ్యాఖ్యలతో మరింత అసంతృప్తి చెందే అవకాశం ఉంది. మొండిగా ఉంటే తప్ప మార్పు సాధ్యం కాదని కేసీఆర్ అంటున్నారు! కానీ, ఆ మార్పును సానుకూలంగా అందరూ స్వీకరించే విధంగా వివరించే ప్రయత్నం, నచ్చజెప్పే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నారా లేదా అనేది కూడా ఇక్కడ స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా! కేసీఆర్ వైఖరి ఆ దిశగా లేదనే అనిపిస్తోంది.