“ధరణి”అనే వ్యవస్థను తీసుకు వచ్చి భూ సమస్యలు… వివాదాలు లేకుండా చేస్తామన్న కేసీఆర్కు ఇప్పుడు ఆ వ్యవస్థ చుక్కలు చూపిస్తోంది. అందులో ఎన్నో లోపాలు బయటపడుతున్నాయి. దాదాపుగా ప్రతీ గ్రామంలోనూ భూ సమస్యలు కనిపిస్తున్నాయి. సమస్యలను సులువుగా పరిష్కరించడానికి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉద్దేశించిన ధరణి వ్యవస్థ కొత్త కష్టాలను తెచ్చింది. సంక్లిష్టంగా మారి ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యంగా తయారైందన్న ఆరోపణలు.. విమర్శళు ఎక్కువగా వస్తున్నాయి.
భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం క్షేత్రస్థాయిలో సక్రమంగా జరగలేదన్న విమర్శలు కొద్ది రోజుల నుంచి ఉన్నాయి. రైతుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఈ కారణంగా 2018లో పట్టాదారు పాసు బుక్కుల పంపిణీ గందరగోళంగా మారిందన్న అభిప్రాయం ఉంది. భూమి అనుభవిస్తున్న లక్షలాది మంది రైతులు భూమిపై హక్కు కోల్పోయారని.. కొత్త పుస్తకాలు రాక ఇప్పటికీ తహసీల్దారు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. నాలుగేళ్లయినా పాసుబుక్కులు రాక, ఆన్లైన్లో భూముల వివరాలు నమోదు కాక సుమారు పాతిక లక్షల ఎకరాల పట్టా భూమి లెక్కల్లో లేకుండా పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతుల్లో అసంతృప్తి పెరిగిపోయింది.
ఇటీవల బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పెద్ద ఎత్తున ధరణిపై ఆరోపణలు చేస్తున్నాయి. ఈ వ్యవస్థను తీసుకు రావడం వెనుక భారీ కుట్ర ఉందని చెబుతున్నాయి. భూములను తమ వారికి కట్టబెట్టే కుట్రతోనే ధరణి వ్యవస్థను తెచ్చారని ఆరోపిస్తున్నారు. ధరణి వల్ల వచ్చినసమస్యలను హైలెట్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ ధరణి ద్వారా సమస్యలు ఉన్నాయని చెప్పడం లేదు. అద్భుతమైన వ్యవస్థ అని చెబుతోంది. కానీ కోర్టుల్లో కూడా ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. సీఎం కేసీఆర్ ఈ అంశంపై దృష్టి పెట్టకపోతే ప్రభుత్వంపై రైతుల అసంతృప్తి పెరిగిపోవడానికి మరో కారణం దొరికినట్లవుతుంది.