ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం దిగి రావడం లేదు. కార్మికులతో చర్చించడానికి సుముఖంగా లేరు. ఇకపై కార్మికులతో చర్చలు ఉండవు అనే అంశాన్నే ఇవాళ్ల కోర్టుకు చెప్పేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఆదివారం నాడు ఇదే అంశమై అధికారులతో చర్చించారు! ఆర్టీసీ కార్మికుల దగ్గరకి వచ్చేసరికి చర్చలు వద్దు అని చెప్పిన కేసీఆర్…. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలతో అధికారుల ద్వారా చర్చలు ప్రారంభించారట! కార్మికుల డిమాండ్లకు స్పందించని సీఎం… ఇప్పుడు ప్రైవేటు సంస్థలు పెట్టబోయే షరతులకు తలొంచాల్సిన పరిస్థితి వస్తోంది.
దశలవారీగా 5100 ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీన్లో భాగంగా తొలిదశలో 1200 బస్సులకు నోటిఫికేషన్ ఇవ్వాలని భావించి, ప్రైవేటు రవాణా సంస్థల యాజమాన్యాలతో సంప్రదించి విధివిధానాలు తయారు చేయాలని గతవారంలోనే అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారని కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో గడచిన వారంలో కొన్ని ప్రముఖ ప్రైవేటు రవాణా సంస్థలతో అధికారులు చర్చించినట్టు సమాచారం. ఇక్కడే అసలు కథ మొదలైంది! ముఖ్యమంత్రి అనుకుంటున్నంత ఈజీగా ప్రైవేటు ఆపరేటర్లు బస్సులు నడిపేయడానికి సిద్ధం లేరు. వారికీ కొన్ని డిమాండ్లున్నాయి, వారూ కొన్ని షరతుల్ని అధికారుల ముందుంచినట్టు సమాచారం. వాటిలో ప్రధానమైంది… ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు! డీజిల్ ధర ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుందీ, కాబట్టి ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఛార్జీలు పెంచుకునే అవకాశం ఉండాలనేది వారి ప్రధాన డిమాండ్ గా తెలుస్తోంది. ఏవైనా రూట్లలో నష్టాలు వస్తే, అప్పటికప్పుడు ప్రయాణ సర్వీసులు ఆపేస్తామనీ, అలాంటప్పుడు జరిమానాలు లాంటివేవీ ఉండకూడదన్నది మరో డిమాండ్ గా తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ వసూలు చేస్తున్న ఛార్జీల ప్రకారం వాహనాలు నడపలేమనీ, ఒక్కో కిలో మీటరుకి కనీసం 75 పైసలు ముందుగానే పెంచి, నోటిఫికేషన్ విడుదల చేయాలన్నది ఇంకో డిమాండ్!
ప్రైవేటు సంస్థలు ఇలాంటి షరతులు పెట్టడం సహజమే. ఎందుకంటే, వారిది కేవలం వ్యాపార దృక్పథం. నష్టాలు వస్తే భరించాల్సిన అవసరం వారికి ఉండదు. ప్రజా రవాణా సేవా రంగంగా ప్రభుత్వం చూడాలి, ప్రైవేటు సంస్థలు ఎందుకు సేవలు చేస్తాయి? ఏదైతేనేం… కార్మికుల డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వం చొరవ చూపదు, కోర్టు చెప్పినా వారితో చర్చించేందుకు కూడా ముందుకు రాదు. కానీ, ప్రైవేటు సంస్థల షరతులను శ్రద్ధగా ఆలకించే స్థితిలో ఉంది! ఇదో విచిత్రమైన పరిస్థితి.