తెలంగాణా మంత్రివర్గంలో నిన్న కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. మంత్రి కె.టి.ఆర్.కి మరిన్ని కీలక శాఖలు దక్కగా, కీలకమయిన వాణిజ్య శాఖకు మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ ని అంతగా ప్రాధాన్యం లేని పశు సంవర్ధక శాఖకి బదిలీ అయ్యేరు. మంత్రుల శాఖలలో మార్పులు చేర్పులు చేస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. దాని ప్రకారం ఇంతవరకు మంత్రి కె.టి.ఆర్. నిర్వహిస్తున్న ఐ.టి.,మునిసిపల్ శాఖలకు అదనంగా, ఇప్పుడు పరిశ్రమలు, పట్టణాభివృద్ధి, వాణిజ్యం, ఎన్.ఆర్.ఐ.,శాఖలను కూడా కేటాయించారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి కీలకమయిన వాణిజ్యపన్నుల శాఖను తప్పించి దానిని ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్దే ఉంచుకొని, ఆయనను పశు సంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, ఫిషరీస్ శాఖలకు బదిలీ చేసారు. ఇంతవరకు ఆయన నిర్వహిస్తున్న సినిమాటోగ్రఫీ శాఖను ఆయనకే ఉంచేరు.
వ్యవసాయ శాఖా మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డికి సహకార శాఖను అదనంగా అప్పగించారు. అలాగే జూపల్లి కృష్ణారావు నిర్వహిస్తున్న పరిశ్రమల శాఖను కె.టి.ఆర్.కి అప్పగించి, కె.టి.ఆర్. చూస్తున్న పంచాయితీ రాజ్ శాఖను జూపల్లికి బదిలీ చేసారు.ఇప్పుడు ఆయన గ్రామీణాభివృద్ధితో బాటు పంచాయితీ రాజ్ ను శాఖను కూడా చూస్తారు.
మంత్రివర్గంలో ఈ మార్పులు చేర్పులు గమనించినట్లయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పద్ధతి ప్రకారం తన కొడుకు కె.టి.ఆర్. రాజకీయ ఎదుగుదలకి బాటలు పరుస్తూ, తన వారసుడిగా తీర్చిదిద్దుతున్నారని స్పష్టం అవుతోంది. అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ కి గ్రేటర్ హైదరాబాద్ లో మంచి పట్టున్న కారణంగా తెరాసలోకి తీసుకొని కీలకమయిన వాణిజ్య పన్నుల శాఖను కట్టబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, గ్రేటర్ పని పూర్తి కాగానే తలసాని పదవిని వెనక్కి తీసుకొని డెయిరీ, ఫిషరీష్, పశు సంవర్ధక శాఖలకి బదిలీ చేయడం పులిహోరలో కరివేపాకుగా తీసి పారేయడంగానే చెప్పుకోవచ్చు. పదవులకు ఆశపడి తెరాసలో చేరాలనుకొంటున్న ఇతర పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకి ఇది ఒక గట్టి హెచ్చరికగా తీసుకోవచ్చు.