బీఆర్ఎస్ లో అసమ్మతి నేతలు మెత్తబడటం లేదు. టికెట్ దక్కించుకున్న నేతలు .. అసమ్మతి నేతల సహకారం కోరుతూ వారి ఇళ్లకు వెళ్తున్నా కనీసం మొహం చూపించాడనికి కూడా ఇష్టపడటం లేదు. బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఎక్కువ మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాగా ఇన్నాళ్లూ అధికార బలాన్ని ఉపయోగించి తమను తొక్కిపెట్టారని అసమ్మతి నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేలతో తాము ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకుని ఓడించి తీరుతామంమటున్ారు.
చాలా నియోజకవర్గాల్లో బుజ్జగింపుల పర్వం వికటించి కిందిస్థాయి నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, జగదీశ్‌రెడ్డి తదితరులు వారు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లా పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు కానీ.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ డిమాండ్లు తీర్చుకోలేమన్నట్లుగా అసమ్మతి నేతల తీరు ఉండటంతో సఫలం కావడం లేదు. చాలా మంది నేతలు బీఆర్ఎస్ను వీడటం ఖాయమని ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.
పార్టీ మారే ఉద్దేశం లేని వారు సొంత పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన టికెట్లు రద్దు చేసి తమకు కేటాయించాలంటూ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నారు. జనగామ, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటనపై నెలకొన్న సస్పెన్స్ తో వర్గ పోరాటం తారస్థాయికి చేరింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి … టిక్కెట్ రేసులో ముందున్న పల్లాకు వ్యతిరేకంగా అర్థనగ్న ప్రదర్శన చేశారు. నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే హైకమాండ్‌కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 6న తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్ రాక తర్వాత బుజ్జగింపుల పర్వం వేగం పుంజుకోవడంతోపాటు క్షేత్రస్థాయిలో ప్రచారం కూడా పట్టాలెక్కుతుందని భావిస్తున్నారు.