బీఆర్ఎస్ ఇబ్బందుల్లో ఉంది. కేటీఆర్ కష్టాల్లో ఉన్నారు. రెండు వైపులా పదునున్న కత్తిలాగా ఫార్ములా ఈ రేసు కేసు మారింది. ఓ వైపు ఈడీ.. మరో వైపు నుంచి ఏసీబీ ముందుకు వస్తున్నాయి. ముందుగా ఎవరు అరెస్టు చేస్తారో తెలియని పరిస్థితి. ఎలాగోలా బయటపడాలని కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ వెళ్తున్నారు కేటీఆర్. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఎవరూ కేసీఆర్ గురించి ప్రస్తావన తీసుకురావడం లేదు. అందరూ మర్చిపోయారు. ఆయన ఫామ్ హౌస్‌కు పరిమితమైపోయి.. బయటకు ఏమీ పట్టించుకోకపోవడంతో ఆయనను ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు.
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి కేసీఆర్ అసలు బయటకు రావడం లేదు. పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితయ్యారు. పార్టీ నేతలు ఎవరైనా పుట్టిన రోజో.. మరో కారణంతోనే కలిస్తే ఓ పది సెకన్లు ఫోటో దిగి పంపుతున్నారు కానీ మాటలు కూడా లేవు. ఒక్క సారి మాత్రం ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీలో చేరికలు అంటూ కొంత మందిని తీసుకు వచ్చారు. వారితో మాట్లాడారు. ఆ వీడియో రిలీజ్ అయింది. అది అధికారిక వీడియో కాదు. ఓ వ్యక్తి ఫోన్ తో తీసిన వీడియో. అంటే ఆయన ఇంకా బయటకు రావాలని అనుకోవడంలేదు.
ఇలాంటి పరిస్థితుల్లో అయినా బయటకు రాకపోతే ఎలా అన్న మానసిక వేదన బీఆర్ఎస్ కార్యకర్తల్లో కనిపిస్తోంది. కేటీఆర్‌ను అరెస్టు చేసే పరిస్థితులు కనిపిస్తున్నా కేసీఆర్ బయటకు రాకపోవడం ఆ పార్టీ నేతల్ని నిరాశపరుస్తోంది. ఈ ఏడాదిలో కేసీఆర్ రంగంలోకి వస్తారని.. ఆయన ఎప్పుడు బయటకు రావాలో ఆయనకు తెలుసని కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. రాజకీయాల్లో ఇంత కన్నా మంచి సందర్భం ఏమి ఉంటుందని బీఆర్ఎస్ క్యాడర్ అనుకుంటోంది. అయితే కేసీఆర్ వైపు నుంచి స్పందన రావడం లేదు. కేటీఆర్ ను జైలుకు పంపిన తర్వాత అయినా ఆయన బయటకు వస్తారేమో చూడాల్సి ఉందని బీఆర్ఎస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఓ బిడ్డ తీహార్ జైల్లో నెలల పాటు గడిపి వచ్చారు. మరో బిడ్డ జైలుకెళ్లే దారిలో ఉన్నారు. ఎవరికైనా ఇది మానసిక వేదన కలిగించేదే. అయితే కేసీఆర్ మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నారని వారి రాజకీయఎదుగుదలకు ఈ జైళ్లు ఓ పిల్లర్‌గా ఉపయోగించే ప్రణాళికలు సిద్దం చేసే పనిలో ఉన్నారని అంటున్నారు. అలా చేస్తే కేసీఆర్ మౌనానికి అర్థం ఉంటుందని లేకపోతే మొత్తం పోతుందని గులాబీ కార్యకర్తలు ఆందోళనలోఉన్నారు.