2022లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు సాయంత్రం తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ ను ఎవరూ మర్చిపోలేరు. ఆయన చీల్చి చెండాడారు. తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. వదిలే ప్రశ్నే లేదన్నారు. నిలదీస్తామన్నారు. ఆయన ఆవేశం.. దేశంలోని విపక్షాలను కూడా ఆకర్షించింది. అయితే ఈ ఏడాది బడ్దెట్ ప్రవేశ పెట్టారు.. తెలంగాణకు ఏమీ లేదు.. ఎన్నికలున్న కర్ణాటకకు కూడా కొన్ని ప్రత్యేక నిధులు కేటాయించారు. అయినా కేసీఆర్ మాత్రం ఆవేశ పడలేదు. ప్రెస్ మీట్ పెట్టలేదు సరి కదా.. ఓ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు.
కేసీఆర్ బుధవారం చత్తీస్ ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి అపాయింట్ మెంట్ ఇచ్చారు. చత్తీస్ ఘడ్లో బీఆర్ఎస్ ఆయనతో పొత్తు పెట్టుకోవడమో..లేకపోతే కలిసి పని చేయడమో చేయడానికి అమిత్ జోగి అంగీకారం తెలిపారు. ఆయన పార్టీకి అక్కడ కనీస ఓటు బ్యాంక్ కూడా లేదు. అజిత్ జోగి పార్టీ పెట్టినప్పుడు ఆయనకు ఉన్న ఇమేజ్ వల్ల కొంత ఓటు బ్యాంక్ వచ్చింది. ఆయన చనిపోయిన తర్వాత అసలు ఆ పార్టీని చత్తీస్ ఘడ్లో పట్టించుకుంటున్న వారు లేరు. అయినా బీఆర్ఎస్ ఉనికి చత్తీస్ ఘడ్లో ఉండాలంటే అలాంటినేతల అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు.
కేంద్రంపై పోరాటానికి ఇవన్నీ చేస్తున్నా.. బడ్జెట్ పై స్పందనను కేసీఆర్ ఎందుకు వ్యక్తం చేయడం లేదనేది సస్పెన్స్ గా మారింది. అంతే కాదు.. గవర్నర్ విషయంలో ఆయన పూర్తిగా సరెండర్ అయిపోయిట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఏం చెబితే అది చేస్తున్నారు. చివరికి ప్రభుత్వం ఆమోదించిన గవర్నర్ ప్రసంగంలో మార్పులు చేయమన్నా చేశారు. దీంతో కేసీఆర్ రాజకీయ వ్యూహంలో మార్పు వచ్చిందన్న అభిప్రాయం ప్రారంభమయింది.