తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీని ఇతర పార్టీలు సీరియస్గా తీసుకోలేదు. అయితే ఉదయం… తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. మంత్రి గంగుల కమలాకర్ లాంటి వాళ్లు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తర్వాత టీఆర్ఎస్ సోషల్ మీడియా చాలా ఘాటుగా రియాక్ట్ అయింది. షర్మిల ఫోటోకు చెప్పుల దండలు వేసిన పాత ఫోటోను వైరల్ చేసింది. అయితే సాయంత్రానికి మొత్తం మాయమైపోయాయి. షర్మిల పార్టీపై ఎవరూ స్పందించవద్దని.. నెగెటివ్ ప్రచారం వద్దని సంకేతాలు రావడంతో… అన్నింటినీ డిలీట్ చేసేశారు.
షర్మిల పార్టీ ఎవరికి లాభం? ఎవరికి నష్టం? మరొకరి ప్రయోజనం కోసం ఇతర పార్టీల ప్రోద్భలం తో ముందుకొస్తోందా? అంటూ పొలిటికల్ గ్రౌండ్ లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మాత్రం షర్మిల కేసీఆర్ వదిలిన బాణమే అంటూ విమర్శలు మొదలు పెట్టింది. మరికొందరు మాత్రం దళిత క్రిస్టియన్, రెడ్డి, వైఎస్ అభిమానులను టిఆర్ఎస్ కు దూరం చేయడానికి బీజేపీ ప్రోత్సాహం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ మౌనం పాటించాలని నిర్ణయించడం ఆసక్తికరంగా మారింది.
కేసీఆర్ నేడు నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. షర్మిల పార్టీ పై అక్కడ నుంచే కేసీఆర్ స్పందిస్తారా? స్పందిస్తే ఎలాంటి ప్రకటన చేస్తారనేది హాట్ హాట్ గా మారింది. ప్రతిపక్షాలు విమర్శలకు ప్రచారం లో దీటుగా పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నా.. జనాలకు వెళ్ళటం లేదని గులాబీ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే ప్రత్యక్షంగా కేసీఆర్ రంగంలోకి దిగుతున్నారు. మొత్తంగా షర్మిల పార్టీపై కేసీఆర్ మౌనంగా ఉండే అవకాశమే ఉంది. ఎందుకంటే… తాను స్పందించడం వల్ల ఆ పార్టీకి అనవసరంగా హైప్ వస్తుందని ఆయన భావించే అవకాశమే ఎక్కువ ఉందంటున్నారు.