భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికి ఢిల్లీ చేరి మూడు రోజులు అయింది. కానీ కేసీఆర్ ఇంత వరకూ బీఆర్ఎస్ గురించి ప్రజలకు కనీసం వివరించే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ రాష్ట్ర సమితిని… భారత రాష్ట్ర సమితికి మార్చాలని తీర్మానం చేసి ఈసీకి ఇచ్చారు. ఇక ఎన్నికల సంఘం మిగతా ప్రక్రియ పూర్తి చేస్తుంది. అయితే ఇలా తెలంగాణ ప్రజలు రెండు సార్లు పట్టం కట్టిన పార్టీ పేరును మారుస్తున్నట్లుగా… కేసీఆర్ ఇంకా తన నోటి ద్వారా ప్రజలకు చెప్పలేదు. తీర్మానం చేసినరోజున మీడియాతో మాట్లాడతారనుకున్నా జరగలేదు. జాతీయ పార్టీ కాబట్టి ఢిల్లీలో మీడియాతో మాట్లాడతారని అనుకుంటున్నారు.
కానీ ఢిల్లీ చేరి మూడు రోజులు అయినా ఇంత వరకూ ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కనీసం ప్రెస్ మీట్ ఉంటుందని కూడా ఎవరూ చెప్పడంలేదు. టీఆర్ఎస్ పేరు మార్చి బీఆర్ఎస్ అని తీర్మానం చేసిన రోజున జెండా, అజెండాల గురించి కేసీఆర్ వివరిస్తారని మీడియాకు సమాచారం ఇచ్చారు. కానీ తర్వాత ఆయన మనసు మార్చుకున్నారు. మీడియాతో మాట్లాడలేదు. అసలు ఇప్పటి వరకూ మాట్లాడలేదు. బీఆర్ఎస్ గురించి ఎలాంటి సమాచారమూ ఆయన నోటి నుంచి ప్రజలకు చెప్పలేదు. అంతర్గతంగా జరిగిపోతోంది.
అయితే భారత్ రాష్ట్ర సమితికి ఈసీ ఆమోదం తెలిపిన తర్వాత కేసీఆర్ అందరికీ క్లారిటీ ఇస్తారని.. ఇంకా అధికారికంగా పేరు మారకుండానే అన్నీ చెప్పడం మంచిది కాదని ఆగినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆలస్యం అయితే ప్రజల్లో ఆసక్తి పోయే అవకాశం ఉందని.. కేసీఆర్ ఎంత త్వరగా ప్రెస్ మీట్ పెట్టి.. బీఆర్ఎస్ జెండా, అజెండాలను ప్రకటిస్తే అంత మంచిదని అనుకుంటున్నారు.