తెలంగాణ గడ్డపై ప్రధాని మోదీ కేసీఆర్పై తీవ్ర ఆరోపణలు చేశారు. గతంలో ఇలాంటి సందర్భాల్లో కేసీఆర్ గంట కూడా ఆలస్యం చేయలేదు. అక్కడ ప్రసంగాలు పూర్తయిన వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి కడిగి పారేసేవారు. కానీ ఈసారి మోదీకి కౌంటర్ ఇచ్చేందుకు కేసీఆర్ రంగంలోకి దిగలేదు. ప్రధాని మోదీ చేసిన విమర్శలపై బీఆర్ఎస్ నేతలు వెంటనే స్పందించారు. హరీష్ రావు దగ్గర్నుంచి జగదీష్ రెడ్డి వరకూ అందరూ కౌంటర్ ఇచ్చారు. మళ్లీ బీజేపీ – బీఆర్ఎస్ మధ్య యుద్ధం ప్రారంభమయిందా అన్న అభిప్రాయం కల్పించేందుకు ప్రయత్నించారు.
అయితే సీఎం కేసీఆర్ స్పందించకపోవడంతో ఆ ఎఫెక్ట్ అయితే రాకుండా పోయింది. గతంలో బీజేపీపై యుద్ధం ప్రకటించినప్పుడు కేసీఆర్ రోజూ ప్రెస్ మీట్లు పెట్టి కడిగి పారేస్తానని ప్రకటించారు. ఇప్పుడు సందర్భం వచ్చినా కూడా స్పందించడం లేదు. ప్రధాని మోదీ విమర్శలు చేసి వెళ్లిన తర్వాత మహారాష్ట్ర నుంచి తమ పార్టీలోకి చేరడానికి వచ్చిన నేతలకు కండువాలు కప్పేందుకు కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చారు. ఈ సందర్భంగా మోదీ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చే చాన్స్ ఉంది. కానీ కేసీఆర్ మాత్రం స్పందించలేదు.
ప్రధాని మోదీపై ఇతర బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించినప్పటికీ.. నాయకుడు కేసీఆర్ మాత్రం .. సైలెంట్ గా ఉండటం బీఆర్ఎస్ వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. దీంతో మిగతా వారు ఏం మాట్లాడినా దానికి విలువ లేకుండా పోయింది. నిజానికి కేసీఆర్ ఇటీవలి కాలంలో బీజేపీ గురించి విమర్శలు చేయడం లేదు. ప్రధాని మోదీని కూడా విమర్శించడం లేదు. వీలైనంత మౌనం పాటిస్తున్నారు. కానీ కాంగ్రెస్ ను మాత్రం టార్గెట్ చేస్తున్నారు. ఇది బీజేపీ నేతలను కూడా అసహనానికి గురి చేస్తోంది. కావాలనే విమర్శించడం లేదని ..దీని వెనుక కుట్ర ఉందంటున్నారు.