తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ముచ్చట్లు చెబుతున్నారు! ఎన్నికలకు ఆయన సిద్ధంగా ఉన్నట్టు, ప్రతిపక్షాల నుంచి సంసిద్ధత వ్యక్తం చేయించేలా ప్రేరేపించే పనిలో ఉన్నట్టున్నారు. అయితే, ఈ క్రమంలో ఆయన డ్రీమ్ మిషన్ జాతీయ రాజకీయాల మాటేమిటి..? భాజపాయేతర కాంగ్రెసేతర ప్రత్యామ్నాయ అజెండా ఏమౌతోంది..? దేశ రాజకీయాలకు కొత్త దశా దిశా చూపిస్తామన్న ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయి..? వాటికి అనుగుణంగా కేసీఆర్ వ్యూహం ఉంటోందా, ఆ దిశగానే అడుగులు వేస్తున్నారా..? ఎన్నికలకు సిద్ధమౌతున్న కేసీఆర్ తీరు చూస్తుంటే.. ప్రయత్నం తాత్కాలికంగా పక్కన పడేశారా అనే భావన కలుగుతోంది.
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర ఏంటనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. గడచిన కొన్ని వారాలుగా చూసుకుంటే, జాతీయ స్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాలకు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. బెంగళూరులో ప్రతిపక్షాలన్నీ ఒకే వేదిక మీదికి వస్తే… ఒక రోజు ముందే వెళ్లిపోయి, అందర్నీ కలిసే అవకాశాన్ని వదులుకున్నారు. ఫెడరల్ ఫ్రెంట్ ప్రయత్నంలో భాగంగా కోల్ కతా, చెన్నై వెళ్లొచ్చారు. అఖిలేష్ యాదవ్ హైదరాబాద్ వచ్చారు. అంతే.. ఆ తరువాత ఫ్రెంట్ ప్రయత్నాలు నెమ్మదిగా తగ్గిపోయాయి. జాతీయ రాజకీయాలపై ప్రస్తుతం కేసీఆర్ మౌనంగానే ఉంటున్నారు. ఆ టాపిక్ పై మాట్లాడటమూ లేదు.
సరైన అవకాశం కోసమే మౌనంగా ఎదురు చూస్తున్నారని కేసీఆర్ అభిమానులు కొంతమంది అంటున్నా, వాస్తవాలు నెమ్మదిగా బోధపడటం వల్లనే తగ్గుతున్నారనేవారూ లేకపోలేదు. ఎందుకంటే, భాజపాని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ తో సహా అన్ని పార్టీలూ సిద్ధమౌతున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ఉంటే కుదరదు అని కేసీఆర్ సొంత అజెండా తయారు చేసుకుంటే… దాన్ని అంగీకరించాల్సిన అవసరం ఇతర పార్టీలకు ఏముంది..? కేసీఆర్ కలుసుకున్న నేతలు కూడా కాంగ్రెస్ తో సఖ్యతగా ఉంటున్న పరిస్థితి. ఇంకోపక్క మమతా బెనర్జీ నేతృత్వంలో ఫ్రెంట్ ప్రయత్నాలు తీవ్రంగానే జరుగుతున్నాయి.
తాజాగా మరో చర్చను కూడా శరద్ పవార్ లేవనెత్తారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రావారీగానే ప్రాధాన్యత అంశాలుంటాయనీ, జాతీయ స్థాయిలో మహాకూటమి వంటివి ఎన్నికల ముందు సాధ్యమయ్యే వాతావరణం కొంత తక్కువగా ఉందనీ, ఎన్నికల తరువాతే కూటమి ఏర్పడటానికి అవసరమైన పరిస్థితులు ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. టీడీపీ, తెరాస, తృణమూల్ వంటి ప్రముఖ పార్టీలకు భాజపాని ఎదుర్కొనడం ఒక లక్ష్యమైతే.. రాష్ట్రస్థాయిలో పట్టు నిలుపుకోవడం కూడా కీలకమైన అంశమే. పైగా, ఎన్నికలు పూర్తయితే తప్ప… ఎవరి బలాబలాలు ఏంటనేది తెలీవు. అది తేలితే తప్ప మూడో ప్రత్యామ్నాయానికి ఎవరు నాయకత్వం వహిస్తారు, ఎవరు అనుచరులుగా వెంట నడిచేందుకు సిద్ధపడతారు అనేది తేలుతుందనే చర్చ కూడా ఇప్పుడు వినిపిస్తోంది. సో.. ఈ క్రమంలో కేసీఆర్ ప్రస్తుతం ప్రయత్నించినా పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. అందుకే, ఆయన కూడా ఫెడరల్ ఫ్రెంట్ పై మౌనంగా ఉంటున్నారని అనుకోవచ్చు.