మే 29వ తేదీన తెలంగాణ సీఎం కేసీఆర్… దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా.. తెలంగాణ రైతులకు త్వరలో తీపికబురు చెబుతానని ప్రకటించారు. కొండ పోచమ్మ సాగర్ ప్రారంభోత్సవ సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జూన్ 29 అయిపోయింది.. జూలై 29 కూడా వస్తోంది. కానీ ఇంత వరకూ ఆ తీపి కబురు జాడ లేదు. మధ్యలో… తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు.. ఆ ” దేశం మొత్తం ఆశ్చర్యపోయే తీపి కబురు” చెబుతారని అనుకున్నారు. కానీ చెప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు.. ఇదే అంశాన్ని పట్టుకుని ముఖ్యమంత్రిని టీజ్ చేయడం ప్రారంభించారు. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దాదాపు రెండు నెలలు గడిచినా.. తీపి కబురు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. రైతులకు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
కేసీఆర్ తన మాటలతోనే అంచనాలు పెంచేసే రాజకీయ నేత. ” దేశం మొత్తం ఆశ్చర్యపోయే తీపి కబురు” అనేక సరికి విస్తృతమైన చర్చ జరిగింది. గతంలో రైతు బంధు లాంటి పథకాన్ని ప్రకటించి దేశం మొత్తం.. ఆశ్చర్యపోయేలా చేశారు కేసీఆర్. తర్వాత తెలంగాణ సర్కార్ వైపు నుంచి ఒకటి రెండు లీకులు కూడా వచ్చాయి. అదేమిటంటే.. తెలంగాణ వ్యాప్తంగా పెట్టాలనుకుంటున్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల్ని రైతులతోనే పెట్టిస్తారని.. వారికి వంద శాతం ఆర్థిక సాయం చేస్తారని.. రైతుల్ని ధనవంతుల్ని.. పారిశ్రామికవేత్తల్ని చేయడమే… కేసీఆర్ చెప్పిన ” దేశం మొత్తం ఆశ్చర్యపోయే తీపి కబురు” అని చెప్పుకొచ్చారు.
నియంత్రిత వ్యవసాయం ద్వారా ఇప్పటికే… రైతులు ప్రభుత్వం సూచించిన పంటలే వేశారు. అత్యధికంగా ఏ పంటలు ఏ ప్రాంతంలో పండుతాయో.. అక్కడ విభాగాల వారీగా రైస్ మిల్లులు, పత్తి జిన్నింగ్ మిల్లులు, కంది, అల్లం,వెల్లుల్లి, ప్రాసెసింగ్ యూనిట్లతో రైతు సెజ్‌లు ఏర్పాటు చేయాలనుకున్నారని చెబుతున్నారు. వీటి పేరు చెప్పకపోయినా.. ” దేశం మొత్తం ఆశ్చర్యపోయే తీపి కబురు” కి కావల్సిన ఫైనాన్స్ కూడా వర్కవుట్ చేశామని ప్రకటించారు. కానీ రెండునెలలు దాటినా.. ఈ తీపికబురు బయటకు రాలేదు. అందుకే.. కాంగ్రెస్ నేతలు టీజింగ్ ప్రారంభించారు. అయితే.. ఇలాంటి వాటిని ఆపి .. ఆపి హైప్ క్రియేట్ చేసి… ఒక్క సారిగా ప్రకటించడం.. కేసీఆర్ రాజకీయ వ్యూహంలో కీలకం.. అలాగే చేస్తారేమో మరి..!