ఇకపై బయటకు వస్తానని ..ప్రజల తరపున పోరాడుతానని భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. ఎల్కతుర్తిలో భారత రాష్ట్ర సమితి రజతోత్సవం సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కాంగ్రెస్ ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ నెంబర్ శత్రువుగా తేల్చారు. ప్రస్తుతం తెలంగాణ ఉన్న పరిస్థితి చూస్తే తనకు ఏడుపొస్తోందని.. ఏం బిమారీ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత కాలం సమయం ఇవ్వాలని తాను బయటకు రాలేదన్నారు.
తాను తెలంగాణకు ఎంతో చేశానని వాటన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. కమిషన్లు తీసుకుని ఢిల్లీకి సంచులు మోస్తున్నారని.. ఢిల్లీ నుంచి నకిలీ గాంధీలు వచ్చి డాన్సులు చేసి హామీలు ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతులకు మేలు చేసింది తామేనని స్పష్టం చేశారు. కరెంట్ ను ఇరవై నాలుగు గంటలు ఇచ్చామని ఇప్పుడు మోటార్లు కాలిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. కేసీఆర్ చక్కగా ఇచ్చిన కరెంట్ కు ఏమయిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు.
భూముల అమ్మకంపైనా కేసీఆర్ స్పందించారు. అభివృద్ధి కోసం అమ్మవచ్చు కానీ ఎవరైనా యూనివర్శిటీ భూములు అమ్ముతారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాకపోవడంపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపైనా స్పందించారు. పిల్లలు అడిగితేనే స్పందించడం లేదని ఇక తాను ఎందుకని ప్రశ్నించారు. అంటే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని అనుకోవచ్చు.
బీజేపీని ఒక్క నక్సలైట్ల అంశంలో మాత్రమే వ్యతిరేకించారు. నక్సలైట్ల ఏరివేత విషయంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ ను ఆపేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సభలో సామెతలు, పంచ్లైన్లు బాగానే చెప్పారు. అయితే అంత సెంటిమెంట్ లేకపోవడంతో.. ప్రసంగం సాదాసీదాగానే గడిచిపోయింది. ఈ సభతో.. బీటర్స్ ఊహించిన ఊపు వస్తుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో కేసీఆర్ ప్రజల్లోకి వచ్చే అంశాన్ని బట్టి ఉంటుందని అనుకోవచ్చు.