ఆంధ్రులను, ఆంధ్రాపాలకులను నిన్నటి వరకు తిట్టిపోసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమరావతి శంకుస్థాపన సభలో మాట్లాడబోతున్నట్లు తెలియగానే రెండుతెలుగు రాష్ట్రాల్లో ఇదో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొన్నీమధ్యనే స్వయంగా కేసీఆర్ ఇంటికివెళ్ళి ఆయన్ని అమరావతి శంకుస్థాపనకు సాదరంగా ఆహ్వానించడం, కేసీఆర్ అందుకు వెంటనే ఆమోదం తెలపడాన్ని చాలామంది ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా వీరిద్దరు చాలాసేపు అనేక విషయాలపై సానుకూలంగా మాట్లాడుకోవడం మరో ఆశ్చర్యకరమైన పరిణామం. ఒకరు ఉప్పు, మరొకరు నిప్పులా ఉండే ఇద్దరు చంద్రులు ఇలా చల్లటి వెలుగులు ప్రసరింపజేయడం శుభకరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు.
శంకుస్థాపన కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ వస్తున్నట్లు అధికారికంగా కబురు వచ్చినప్పటికీ , ప్రస్తుతం పంజాబ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఆయన తన పర్యటనను రద్దుచేసుకున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా హెలికాప్టర్ లో అమరావతికి వెళతారు. శంకుస్థాపన కార్యక్రమం అయ్యాక సభలో ఆయన ప్రసంగిస్తారు. ముందుగా అనుకున్న ప్రసంగీకుల లిస్ట్ లో కేసీఆర్ పేరులేకపోయినా తదుపరి ఆయన పేరు చేర్చారు. ఈ మార్పుకు ప్రధానమంత్రి కార్యాలయం ఆమోదం తెలియజేసింది. కాగా, రేపు ప్రధాని నరేంద్రమోదీ హిందీలో చేసే ప్రసంగాన్ని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలుగులో అనువదించనున్నారు.
రెండు తెలుగురాష్ట్రాల అభివృద్ధికి ఇద్దరు `చంద్రుల’ మధ్య సఖ్యత ఉండాలని అటు ప్రధాని మోదీ, ఇటు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అభిలషిస్తున్నారు. ఇరు రాష్ట్రాలకు గవర్నర్ గా ఉన్న నరసింహన్ కూడా వీరిద్దరి మధ్య సఖ్యత తీసుకురావడం కోసం గతంలో కొన్ని ప్రయత్నాలు చేశారు. రేపటి సభతో వీరిద్దరి మధ్య అనుబంధం గట్టిపడితే అది తెలుగురాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని అనుకుంటున్నారు. అందుకే, కేసీఆర్ ప్రసంగం పట్ల పలువురు ఆసక్తికనబరుస్తున్నారు. కేసీఆర్ కూడా ఈ సభలో ఫ్రీటంగ్ తో మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
– కణ్వస