తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న బీజేపీని పేరు పెట్టి విమర్శించారు కానీ.. మోదీ పేరు ఎత్తలేదు. బుధవారం మేడ్చల్ జిల్లాలో అయితే బీజేపీ పేరు కూడా ఎత్తలేదు. ఆయన చెప్పాల్సినదంతా చెప్పారు. మతం పేరిట దేసాన్ని విభజించే కుట్ర జరుగుతోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అలా చేస్తోంది బీజేపీ అని మాత్రం చెప్పలేదు. భారత్ దేశాన్ని కులం పేరిట మతం పేరిటే విడదీసే ప్రయత్నం జరుగుతోంది. ఇది మంచి పద్దతి కాదన్నారు. కులమతాలతో విడిపోతే నష్టపోతామని కేసీఆర్ తెలంగాణ ప్రజలను హెచ్చరించారు. మోసపోతే చాలా గోస పడే ప్రమాదం ఉంటుంంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు.
కేసీఆర్ తన ప్రసంగంలో అత్యధికంగా తన పాలనలో ప్లస్ పాయింట్లు చెప్పుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. పది లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చామమని.. అడిగిన వారందరికీ త్వరలో రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు.. స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదిస్తే చాలన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత బాగా అభివృద్ధి చెందామని.. తెలంగాణ ఏర్పడ్డ టైంలో తలసరి ఆదాయం లక్ష రూపాయుల ఉంటే.. ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్‌గా రెండు లక్షల 78వేల 500 రూపాయలుగా ఉందన్నారు.
తెలంగాణలో 24 గంటలు కరెంటు ఇస్తున్నామని .. దేశంలో 75 ఏళ్ల పాలనలో చేతగాని తనం వల్ల బ్యాడ్ పాలసీల వల్ల దేశం మొత్తం విద్యుత్ కొరత ఉందన్నారు. కేసీఆర్ కంటే ఒడ్డూపొడుగూ ఉన్న వాళ్లు చాలా మంది సీఎంలు అయ్యారు. వాళ్లెవరూ ఎందుకు కరెంటు ఇవ్వలేకపోయారని ప్రశ్నించారు. ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు పేలినాయో తెలియదు. కరెంటు కోసం ధర్నాలు చేసిన సంగతి చూశాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తెలంగాణలో ఇన్వర్టర్లు, జనరేటర్లు, మోటార్ వైడింగ్ సంస్థలు దివాళా తీశాయని సెటైర్ వేశారు. కేసీఆర్ ఇప్పటి వరకూ తన ప్రసంగాల్లో బీజేపీ, మోదీని ప్రధానంగా టార్గెట్ చేసేవారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా స్టైల్ మార్చారు. తన పాలన గొప్పతనాన్ని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.