కొడంగల్ నియోజక వర్గంలో కేసీఆర్ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అరెస్టు చేయడం, ఈ ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం… ఈ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ ప్రసంగం ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది. ప్రతీరోజూ కేసీఆర్ పాల్గొంటున్న ఎన్నికల ప్రచార సభల కంటే.. రేవంత్ రెడ్డి నియోజక వర్గంలో జరిగే సభకి ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, ఇక్కడికి వచ్చిన కేసీఆర్ తన ప్రసంగాన్ని రొటీన్ గానే ప్రారంభించారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారంటే… పెద్ద మెజారిటీతో తెరాస అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుస్తారని తనకు అర్థమైందన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మంచి మార్పు వచ్చిందనీ, మొత్తంగా 14 స్థానాల్లోనూ తెరాసను ప్రజలు గెలిపించబోతున్నారు అన్నారు. ఎన్నికల్లో ప్రజలే గెలవాలి, ఆగమాగమై ఓట్లెయ్యొద్దు, 24 గంటల కరెంటు, ఎవరికి ఓటెయ్యాలన్న గందరగోళం ప్రజలకు లేదు… ఇలాంటి రొటీన్ స్పీచ్ అంతా మామూలుగానే ఉంది.
శత్రువులు ఎక్కడో లేరనీ, పాలమూరు జిల్లాలోనే ఉన్నారన్నారు కేసీఆర్. ఎంతమందితో కేసీఆర్ కొట్లాడాలి, ఎన్ని రాకాసులతో కొట్లాడాలన్నారు. నాగం జనార్థన్ రెడ్డి, ఇంకొకాయన దేవరకద్రలో పోటీ చేస్తున్నారు, మరొకరు కొల్లాపూర్ లో చేస్తున్నారనీ… ఈ ముగ్గురూ పాలమూరు ఎత్తిపోతలు కట్టొద్దని కోర్టులో కేసు వేశారన్నారు. ఇటువంటివారు ఈ జిల్లాలో ఉండబట్టే ఈ దరిద్రం మనకున్నదన్నారు. పాలమూరు దరిద్రం వదలాంటే.. ఈ దరిద్రులను మీరు వదిలెయ్యాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కొడంగల్ లో కొన్ని సమస్యలున్నాయనీ, ఎన్నికలు అయిన వెంటనే తానే స్వయంగా వచ్చి దగ్గరుండి పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీద కూడా యథావిధిగా కొన్ని విమర్శలు చేశారు. అభివ్రుద్ధిని అడ్డుకుంటున్నారు అన్నారు.
అంతే.. అంతకుమించి ఎలాంటి చురుక్కులూ చమక్కులూ కేసీఆర్ ప్రసంగంలో లేనే లేవు! అత్యంత సాదాసీదాగా మాట్లాడేసి వెళ్లిపోయారు. రేవంత్ నియోజక వర్గంలో ఆయనపై ఒక్క విమర్శగానీ.. పరోక్షంగా ఏ కామెంటూ చెయ్యలేదు. ఉద్దేశపూర్వకంగానే ఆ అంశాన్ని కేసీఆర్ పక్కన పెట్టారనేది సుస్పష్టం. ఎందుకంటే, రేవంత్ ప్రస్థావన తీసుకొస్తే… ఆయనకి ప్రాధాన్యత పెంచినట్టు అవుతుందనేది కేసీఆర్ ఆలోచనై ఉంటుంది. పైగా, రేవంత్ అంశంలో ప్రభుత్వం ఓవరాక్షన్ చేసిందనే సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. కోర్టులో ఈసీ, పోలీసులు నీళ్లు నమలాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి… ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రేవంత్ గురించి కేసీఆర్ ప్రస్థావించలేదు. సభ కొడంగల్ లో పెట్టినా… మొత్తం మహబూబ్ నగర్ జిల్లాను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడేసి వెళ్లిపోయారు. ముగ్గురు నాయకులు అంటూ ఇతరుల్ని విమర్శించారేగానీ… రేవంత్ ఊసెత్తలేదు.