కేసీఆర్ స్పీచ్ అంటే…మార్క్ డైలాగ్ లే కాదు.. అంతకుమించిన పంచ్ లు కూడా. దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ ప్రసంగం అనేసరికి తెలంగాణ వ్యాప్తంగా ఓ బజ్ నెలకొంది. అన్నీ కళ్ళు కేసీఆర్ ప్రసంగంపైనే కేంద్రీకృతం అయ్యాయి. అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నిర్వహిస్తున్న సభ కావడం ,పార్టీ రజతోత్సవ సభ కావడంతో ఆయన ఏం మాట్లాడుతారోననే ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ప్రసంగంలో పంచ్ డైలాగ్స్ కోసం బీఆర్ఎస్ సైనికులే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేశారు కాని, ఆ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి.
ఎల్కతుర్తిలో కేసీఆర్ ప్రసంగంపై పెటుకున్న అంచనాలు పూర్తిగా తేలిపోయాయి. గులాబీ బాస్ స్పీచ్ లో అక్కడక్కడ పంచ్ లైన్స్ , నాలుగైదు మార్క్ డైలాగ్ లు మినహా కేసీఆర్ స్పీచ్ రొటీన్ గా సాగిపోయినట్లుగా అనిపించింది.ఎప్పటిలాగే రైతుల సమస్య, 24గంటల కరెంట్ ఇవ్వడం లేదని విమర్శలతోపాటు, దేవుళ్ల మీద ఒట్టేసి ప్రజలను మోసం చేస్తున్నారని పాత డైలాగ్ లే చెప్పారు. పాతికేళ్ల పార్టీ చరిత్ర గురించి కూడా కేసీఆర్ ఎప్పుడూ చెప్పే విషయాలనే ఏకరువు పెట్టారు తప్పితే అందులోనూ కొత్తదనం కనిపించలేదు.
దీంతో కేసీఆర్ స్పీచ్ పాతచింత కాయ పచ్చడిలా అనిపించిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సభకు హాజరైన వారిలోనూ ఎక్కువగా ఇదే వాదన వినిపించడం విశేషం. కొత్తగా చెప్పిన విషయం ఏంటంటే.. ఇక నుంచి ఫామ్ హౌజ్ ను వీడి, ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నానని చెప్పడమే. అంతేకాని , కేసీఆర్ ప్రసంగంలో కొత్తదనం ఎక్కడా కనిపించలేదు. దీంతో భారీ అంచనాలు పెట్టుకున్న కేసీఆర్ ప్రసంగం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఆయనలో మునుపటి వాగ్ధాటి కనిపించకపోవడంతో కొంతమందిలో ఓ విసుగు అయితే కనిపించింది.